Siren Movie Release Date: కోలీవుడ్ స్టార్ జయం రవి, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'సైరెన్'. 108 అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. అయితే చాలా రోజుల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి, డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదల కాబోతోందంటూ ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చారు.
'సైరెన్' సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు రెండు అనౌన్స్‌మెట్ పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీంతో 'జయం' రవి - కీర్తి సురేష్‌ల సినిమాని నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోనే స్ట్రీమింగ్ చేయనున్నారనే వార్తలకు చెక్ పడినట్లయింది.
నిజానికి 'సైరెన్' మూవీ ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉంది. గతేడాది దీపావళి టైంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు ఈ సినిమ టీజర్ ను లాంచ్ చేశారు. హీరో 'జయం' రవి ట్వీట్ చేస్తూ ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్ లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ చెప్పిన సమయానికి ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. దీంతో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు రూమర్స్ వచ్చాయి. అంతేకాదు రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని, 'సైరెన్ మోగేది థియేటర్లలోనే అని మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
'సైరన్' అనేది ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన రివేంజ్ డ్రామా. క్రిమినల్ గా మారిన ఒక అంబులెన్స్ డ్రైవర్, కొన్నేళ్ల తర్వాత జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చి తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడు? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో జయం రవి యంగ్ లుక్ తో పాటుగా, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. పోలీసాఫీసర్ పాత్రలో కీర్తీ సురేష్ నటించింది. సముద్రఖని, యోగి బాబు, తులసి, కౌశిక్ మెహతా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
'అభిమన్యుడు', 'విశ్వాసం', 'హీరో' వంటి పలు చిత్రాలకు రైటర్‌గా పని చేసిన ఆంటోని భాగ్యరాజ్.. 'సైరన్' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుజాత విజయ్ కుమార్ - అనూష విజయ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. సెల్వ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా, రూబెన్ ఎడిటర్ గా వర్క్ చేసారు. టీజర్ తోనే అందరిలో ఆసక్తి కలిగించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Also Read: ధనుష్ - నాగ్ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్!