DSP for DNS: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి #DNS అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. 2021లోనే అనౌన్స్ చేయబడిన ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది.. వెంటనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను అధికారికంగా ప్రకటించారు.


ధనుష్ - నాగార్జునల సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ''DNS ఫ్యామిలీలోకి మరో పవర్‌ హౌస్ అదనంగా వచ్చి చేరింది. DSPని ఈ ప్రాజెక్ట్ లోకి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మీ అందరినీ ఆశ్చర్యపరిచే కొన్ని ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ చార్ట్‌ల కోసం సిద్ధంగా ఉండండి'' అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవికి వెల్కమ్ చెబుతూ ఓ పోస్టర్ ను పంచుకున్నారు.






సెన్సిబుల్ సినిమాలు, కంటెంట్ రిచ్ మూవీస్ రూపొందించడంలో నిష్ణాతుడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మరోవైపు కంటెంట్-బేస్డ్ చిత్రాలకు సెన్సేషనల్ ఆల్బమ్‌లను అందించడంలో దిట్ట దేవిశ్రీ ప్రసాద్. అలాంటి జాతీయ ఉత్తమ దర్శక, సంగీత దర్శకులు తొలిసారిగా చేతులు కలపడంతో DNS సినిమాపై అందరిలో ఆసక్తి రెట్టింపు అయింది. ఈ చిత్రానికి చార్ట్‌ బస్టర్ ఆల్బమ్‌ను అందించడం ఖాయమని సినీ అభిమానులు భావిస్తున్నారు. 


డీఎస్పీ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్', 'కంగువ', 'తండేల్', అజిత్ 'AK63' వంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' 'రత్నం' వంటి క్రేజీ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు. గతంలో నాగార్జునకు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు దేవి. అలానే ధనుష్ తోనూ రెండు తమిళ సినిమాలకు వర్క్ చేసారు. ఇప్పుడు టాలీవుడ్ - కోలీవుడ్ స్టార్ హీరోలిద్దరూ కలిసి నటిస్తున్న DNS చిత్రానికి సంగీతం అందించడానికి రెడీ అయ్యారు. మరి ఈ సినిమాకి ఎలాంటి సాంగ్స్ ఇస్తాడో, ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తారో వేచి చూడాలి. 


తెలుగు తమిళ్ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న #DNS సినిమాలో ధనుష్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లుగా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.


Also Read: అక్కడ అల్లు అర్జున్ కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ ని క్రాస్ చేసిన 'హను-మాన్'