Kanguva Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ కు అనూహ్య స్పందన లభించింది. సూర్య గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక వారియర్ అవతార్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి మరో సరికొత్త పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. పనిలో పనిగా సినిమా విడుదలపై మరోసారి స్పష్టత ఇచ్చారు.


దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'కంగువ' టీమ్ బ్రాండ్ న్యూ పోస్టర్ ను సోషల్ మీడియా మాధ్యమాలలో రిలీజ్ చేశారు. ఇందులో సూర్య మండుతున్న కాగడా పట్టుకొని నిలబడి ఉన్నాడు. పొడవాటి జుట్టు, ఒంటి నిండా టాటూలతో ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నాడు. బ్యాగ్రౌండ్ లో అతని అనుచరులు శంఖారామం పూరించడాన్ని మనం గమనించవచ్చు. ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ వచ్చిన వాటిలో ఇదే బెస్ట్ అని కామెంట్ చేస్తున్నారు.


Also Read: రష్మిక వేసుకునే డ్రెస్సులు, ఎక్స్‌పోజింగ్ కంటే వీడియోలో పెద్దగా ఏమీ లేదు - ‘డీప్‌ఫేక్’పై నటి షాకింగ్ కామెంట్స్!


'కంగువ' అనేది సూర్య కెరీర్ లో 42వ సినిమా. ప్రాచీన కాలానికి, ప్రస్తుతానికి లింక్ చేస్తూ సాగే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కంగువ అంటే తమిళంలో అగ్నిలా దేనినైనా దహించే శక్తి కలిగినవాడు, అత్యంత పరాక్రమవంతుడు వంటి అర్థాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సూర్య ఆరు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయికగా నటించే ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, యోగిబాబు, నటరాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 'కంగువ' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇది సూర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే సినిమా. ఇందులో యాక్షన్ సీన్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయని ఫస్ట్ గ్లింప్స్‌ ని బట్టి తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 


ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్న 'కంగువ' మూవీని 2024 సమ్మర్ లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు తమిళం హిందీతో సహా ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో ౩-డీ ఫార్మాట్‌లో గ్రాండ్‌ గా విడుదల చేయనున్నారు. దీనికి తగ్గట్టుగానే శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం థాయ్‌ లాండ్‌ లో షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్ర బృందం.. ఇటీవల చెన్నైలో ఓ కీలక షెడ్యూల్‌ ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.


Also Read: 'అన్నయ్యతో గొడవ.. అమ్మ బాగా స్ట్రగుల్ అయ్యేది' - సూర్య గురించి కార్తీ ఏమన్నాడంటే?