‘జైలర్’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌. అదే ఊపులో వరుస సినిమాలో చేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ అనే సినిమా చేస్తున్నారు.  విష్ణువిశాల్‌, విక్రాంత్‌ లీడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘లాల్‌ సలామ్‌’ టైటిల్ పోస్టర్‌ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.


మొయిద్దీన్ భాయ్‌ గా రజనీకాంత్


భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ని టీవిలో చూసి ఉంటారు. రేడియోలో విని ఉంటారు. కానీ డైరెక్ట్ గా చూశారా? అంటూ టీజ‌ర్ ప్రారంభం అవుతుంది. అయితే, ఈ మ్యాచ్ వ‌ల‌న హిందూ ముస్లింల‌ మధ్య గొడవలు జరిగినట్లు ఇందులో చూపిస్తారు. ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్‌ అనే పాత్రలో కనిపించబోతున్నారు. రజనీకాంత్ ఎప్పటిలాగే విలన్స్ ను చితకబాదుతూ ఎంట్రీ ఇస్తారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో ఎన్నో మ‌తాలు, కులాలు ఉన్నాయి.  కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టారు. ఇలాంటి సందర్భంలో మొయిద్దీన్ భాయ్‌(రజనీకాంత్) ఏం చేశాడు? మంచి క్రికెట‌ర్స్‌, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఆ గొడ‌వ‌ల‌ను ఆయన ఎలా స‌ర్దుబాటు చేశారు? ప్ర‌జ‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త‌ను కుదిర్చార‌నేది ‘లాల్ స‌లామ్‌’ సినిమాలో చూపించబోతున్నారు మేకర్స్.  



సంక్రాంతికి ‘లాల్ సలామ్’ విడుదల


ఇప్పటికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ‘లాల్ స‌లామ్‌’ చిత్రం సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా  ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ముంబై వంటి సెన్సిటివ్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన‌ప్పుడు జ‌రిగిన న‌ష్టం ఏంటి? క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్ద‌రు యువ‌కులు.. వారిలో ఒక‌రు హిందు, మ‌రొక‌రు ముస్లిం. ఇద్ద‌రి మ‌న‌సుల్లో మ‌తపూరిత ద్వేషం ఉండ‌టంతో క్రికెట్ ఆట‌లో ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డే స‌న్నివేశాలు, దాని వ‌ల్ల  వారిద్ద‌రూ మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డే స‌న్నివేశాల‌ను చూడొచ్చు. ఆట‌లో మ‌తాన్ని చేర్చారు. అంతే కాకుండా పిల్ల‌ల మ‌న‌సుల్లో విషాన్ని నింపారు అని అక్క‌డున్న పెద్ద‌ల‌ను మొయిద్ధీన్ తీవ్రం మండిపడతారు. హిందు, ముస్లింలు గొడ‌వ ప‌డుతున్న‌ప్పుడు.. మొయిద్దీన్ భాయ్ ఆ ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశార‌నే క‌థాంశంతో ‘లాల్ స‌లాం’ రూపొందింద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థమ‌వుతుంది. ఎప్ప‌టిలాగానే సూప‌ర్ స్టార్ రజినీకాంత్ త‌న‌దైన స్టైలింగ్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకోనున్నారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ యువ క్రికెట‌ర్స్‌గా అలరించబోతున్నారు. త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.


Read Also: నిర్వాహకుల అత్యుత్సాహం, అల్లు అర్జున్​కు ట్రోలింగ్ తలనొప్పి!