Israel Gaza War:



ఇజ్రాయేల్,హమాస్ యుద్ధం..


ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Hamas War) ఐక్యరాజ్య సమతిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి భారత్‌ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనాపై ఇజ్రాయేల్ చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా భారత్ అందుకు మద్దతు తెలిపింది. పాలస్తీనాతో పాటు తూర్పు జెరూసలేంని ఆక్రమించడంపై ఐక్యరాజ్య సమితి (United Nations Resolution) ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా..వాటిలో అమెరికా, కెనడా ఉన్నాయి. 8 దేశాలు ఓటింగ్‌కి దూరంగా ఉన్నాయి. అయితే...ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. హమాస్‌పై దాడుల్ని ఇజ్రాయేల్ తక్షణమే ఆపేయాలని, మానవతా కోణంలో ఆలోచించాలని కోరుతూ తీర్మానం పాస్ చేశారు. ఈ ఓటింగ్‌కి భారత్ దూరంగా ఉంది. ఇప్పుడు మాత్రం ఇజ్రాయేల్‌కి వ్యతిరేకంగా ఓటు వేసింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు చేశారు. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజాలో కనీసం 11 వేల మంది పౌరులు ఈ యుద్ధానికి బలి అయినట్టు అంచనా. అటు ఇజ్రాయేల్‌లో 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మంది పౌరులు హమాస్‌ చెరలో బందీలయ్యారు. అయితే..అంతకు ముందు ఓటింగ్‌కి దూరంగా ఉండడంపై భారత్‌ వివరణ ఇచ్చింది. 


సంక్షోభంపై భారత్‌ ఆవేదన..


గాజాలోని సంక్షోభంపై తామూ ఆవేదన వ్యక్తం చేస్తున్నామని, అలా అని తొందరపాటుగా నిర్ణయం తీసుకోలేకమని స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ తీర్మానంలో కొన్ని సవరణలు చేయాలని భారత్‌ కోరింది. ఆ తరవాత ఆ సవరణలు చేసిన తీర్మానానికి 88 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. అయితే...ఈ తీర్మానంలోనూ భారత్‌కి అనుకూలమైన అంశాలు లేకపోవడం వల్ల ఓటింగ్‌కి దూరంగా ఉండిపోయింది. అయితే...హమాస్‌ చేతుల్లో బందీలుగా ఉన్న వాళ్లని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది భారత్. కచ్చితంగా ఈ మానవతా సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. కొంత కాలం యుద్ధానికి విరామమిస్తే మానవతా సాయం చేసేందుకు వీలవుతుందని స్పష్టం చేసింది. భారత్‌ కూడా అన్ని విధాలుగా సాయం చేసేందుకు ముందుకొస్తుందని వెల్లడించింది. 


గాజాలోని అతిపెద్ద హాస్పిటల్‌పై (Al Shafa Hospital)ఇజ్రాయేల్ దాడి చేయడం యుద్ధ తీవ్రతను మరింత పెంచింది. ఐసీయూలోని రోగులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచి వేసింది. గాజాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయేల్ సమర్థించుకుంటున్నప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్‌లోని చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ దాడుల్లో ఇద్దరు పసికందులు మృతి చెందారు. పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. వాళ్లకు వైద్యం అందించేందుకూ వీల్లేకుండా పోయింది. అందుకే ఇజ్రాయేల్ మిగతా చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇస్తోంది. అంతే కాదు. వాళ్లకు అవసరమైన చికిత్స అందించేందుకూ సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయేల్ సైన్యం (Israel Army) ప్రకటించింది. పాలస్తీనా అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం...చాలా మంది చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. 


Also Read: Gaza News: పాలస్తీనాకు మద్దతుగా లండన్‌లో భారీ ర్యాలీ, రోడ్లపై లక్షలాది మంది