Israel Gaza War:


లండన్‌లో భారీ ర్యాలీ..


పాలస్తీనాపై ఇజ్రాయేల్ యుద్ధం (Israel Hamas War) చేయడంపై అంతర్జాతీయంగా అలజడి రేగుతోంది. కొన్ని దేశాలు ఇజ్రాయేల్‌కి  మద్దతునివ్వగా మరి కొన్ని దేశాల్లో మాత్రం ఇజ్రాయేల్‌కి వ్యతిరేకంగా నిరసనలు,ఆందోళనలు జరుగుతున్నాయి. సెంట్రల్ లండన్‌లో పాలస్తీనా మద్దతుదారులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దాదాపు 3 లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంత మంది ఒకేసారి రోడ్లపైకి రావడం వల్ల పోలీసులు అడ్డుకోలేకపోయారు. అప్పటికీ 100 మందిని అరెస్ట్ చేసి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.  "National March for Palestine" పేరిట చాలా దూరం ఈ ర్యాలీ కొనసాగింది. బ్రిటన్ యుద్ధంలో చనిపోయిన వారికి నివాళిగా జరుపుకునే Armistice Day రోజునే ఈ భారీ ర్యాలీ జరిగింది. ఇప్పటికే పలు దేశాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు లండన్‌లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాలస్తీనాపై యుద్ధం (Gaza Attack) ఆపేయాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ర్యాలీలు మరింత అలజడి రేపుతున్నాయి. లండన్‌లోని హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ సహా వెస్ట్‌మిన్‌స్టర్‌ వద్ద ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. కొంతమంది నిరసనకారులు పోలీసులపై బాటిల్స్ విసిరారు. వీధుల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఆందోళనల గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని లండన్ మేయర్‌ మండి పడ్డారు. ఇన్నాళ్లూ లండన్‌లో ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధంపై ఎక్కడా ఆందోళనలు జరగలేదు. ఉన్నట్టుండి ఇలా లక్షలాది మంది రోడ్లపైకి రావడం ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టింది. ఇకపై ఇలాంటి నిరసనలు జరగకుండా జాగ్రత్తపడుతోంది.