Israel Hamas War: రష్యా-ఉక్రెయిన్ యుద్దం కొనసాగుతుండగా.. కొన్ని రోజుల కిందట మరో రెండు దేశాల మధ్య యుద్దం మొదలైంది. ఇజ్రాయెల్-పాలస్తీనాలోని హమాస్ మధ్య నెల రోజులుగా భీకర యుద్దం నడుస్తోంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, యుద్ద విమానాలతో దాడి చేసుకుంటున్నాయి.  దీని వల్ల ఇరు ప్రాంతాలకు నష్టం జరుగుతోంది. సైనికులతో పాటు  సాధారణ ప్రజలు కూడా ఈ యుద్దంలో చనిపోతున్నారు. ఎత్తైన భవనాలు, ఆస్పత్రులను  ఇరు వర్గాలు టార్గెట్ చేస్తోన్నాయి. దీంతో బాంబుల దెబ్బకు భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఈ యుద్దంతో ఆర్ధిక, ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. 


అయితే తాజాగా ఉత్తర గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిపాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో బాంబుల మోతతో హాస్పిటల్ అంధకారంలోకి వెళ్లింది. ఆస్పత్రి వద్ద హమాస్ దళాలపై బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో ఆస్పత్రి అంధకారంలోకి వెళ్లగా.. రోగులు కూడా చనిపోతున్నారు. కరెంట్, ఇంధనం లేకపోవడంతో జనరేటర్ ఆగిపోవడంతో ఐసీయూలోని రోగులు మరణిస్తున్నారు. కరెంట్ లేకపోవడంతో ఓ పసికందుతో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆస్పత్రిలోని పౌరులు భయంతో వణికిపోతున్నారు. బయటికి వెళ్లలేక, అంధకారంలో ఉండలేక అవస్థలు పడుతున్నారు.


ఇంధనం లేక ఆస్పత్రిలోని చివరి జనరేటర్ కూడా పనిచేయడం లేదని, ఐసీయూలోని రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సెల్మియా వెల్లడించారు.  పిల్లల ఎమర్జెన్సీ విభాగంలో 37 మంది చికిత్స పొందుతున్నారని, వారి ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలిపారు. ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నవారు ప్రాణాలు కోల్పోతున్నారని, వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవని చెప్పారు. ఆస్పత్రిలో పౌరులు ఉన్నారని, వాళ్లు కూడా భయపడుతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఆస్పత్రి వద్ద వేలమంది పౌరులు ఉండగా.. భయానక పరిస్థితులతో అల్లాడిపోతున్నారు.  ఆస్పత్రిపై జరుపుతున్న దాడులపై ఇజ్రాయెల్ వాదన మరోలా ఉంది. ఆస్పత్రి కింద హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉన్నట్లు గుర్తించామని ఇజ్రాయెల్ చెబుతోంది. సాధారణ ప్రజలను మానవ కవచాలుగా హమాస్ వాడుకుంటోందని ఆరోపిస్తోంది.


ఈ క్రమంలో ఆస్పత్రిపై దాడి చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్‌ను ఎదుర్కొవాలంటే ఆస్పత్రిని ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్ దళాలు చూస్తోన్నాయి. ఇజ్రాయెల్ దళాలు ఏ క్షణంలోనైనా ఆస్పత్రిలోకి ప్రవేశించే అవకాశముంది. ఇజ్రాయెల్ దాడులతో ఈ హాస్పిటల్‌లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.  కాగా అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఈ యుద్దం మొదలైంది. ఈ దాడిలో 1400 మంది చనిపోగా.. మరో 200 మందిని బందీలుగా గాజాకు హమాస్ టెర్రరిస్టులు తీసుకెళ్లారు. దీంతో గాజాపై ఇజ్రాయల్ వైమానిక దాడులతో పాటు భూతల దాడులకు పాల్పడుతోంది.  యుద్దాన్ని ఆపేయాలని ప్రపంచదేశాలు ఇజ్రాయెల్, పాలస్తీనాకు సూచిస్తున్నాయి. కానీ రెండు దేశాలు తగ్గడం లేదు. గాజాను పూర్తిగా అంతం చేసిన తర్వాత యుద్దం ముగుస్తుందని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ యుద్దం ఎప్పుడు ముగుస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇంకా కొనసాగితే రెండు దేశాలకు నష్టమేనని చెబుతున్నారు.