కోట్లాది మందికి క్రికెట్ ఎలా ఆడాలో నేర్పిన ఘనత గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సొంతమని ప్రముఖ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నారు. ఆట ఏ విధంగా ఆడాలో మాత్రమే కాదు, ఎంత వినమ్రంగా ఉండాలో కూడా నేర్పించారని చెప్పారు. తాను కూడా సచిన్ టెండూల్కర్ ఆటకు, వ్యక్తిత్వానికి వీరాభిమానిని అని మురళీధరన్ పేర్కొన్నారు. మరో వంద ఏళ్ళు గడిచినా సరే... సచిన్ సాధించిన ఘనత మరొకరు సాధించలేరని, ఆయన లాంటి వ్యక్తి మరొకరు జన్మించలేరని మురళీధరన్ కొనియాడారు.  


టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో 800 వందల వికెట్లు తీసిన ఏకైన బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా '800' (800 Movie). మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మది మలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి ఈ బయోపిక్ దర్శకుడు. 


మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై వివేక్ రంగాచారి '800'ను నిర్మించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు నిర్మాత, శ్రీదేవి పిక్చర్స్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో విడుదల అవుతోంది. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు ముంబైలో సచిన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా... '800' ట్రైలర్ విడుదల చేశారు. 


మురళీధరన్ అడిగితే 'నో' చెప్పలేను - సచిన్
'800' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ''ముత్తయ్య మురళీధరన్ నాకు మంచి స్నేహితుడు. 1993లో అనుకుంట... తొలిసారి అతడ్ని కలిశా. అప్పుడు మొదలైన మా స్నేహం ఇప్పటికీ అలాగే ఉంది. నేను ఆగస్టులో శ్రీలంక వెళ్లాను... యూనిసెఫ్ వర్క్స్ కోసం! 'మీ ఊరిలో ఉన్నాను' అని మెసేజ్ చేస్తే... 'నేను మీ దేశంలో ఉన్నాను' అని మురళీధరన్ రిప్లై ఇచ్చాడు. అప్పుడు నాకు '800' సినిమా గురించి చెప్పాడు. 'ట్రైలర్ విడుదల కార్యక్రమానికి నువ్వు రాగలవా? అని అడిగాడు. మురళీధరన్ అడిగితే నేను 'నో' చెప్పలేను. అతని కోసం ఇక్కడికి వచ్చా. మురళీధరన్ ఎంతో సాధించినా సరే... చాలా సాధారణంగా ఉంటాడు. ఆటలో జయాపజయాలు సహజం. కొన్నిసార్లు మన ఆట చూసి మనమే నిరాశ పడతాం. అక్కడి నుంచి నిలబడి పోటీ ఇవ్వడమే అసలైన ఆటగాడి లక్ష్యం. మురళీధరన్ ఆ పని చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొత్తం మీద 10,500 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఫస్ట్ క్లాస్ తీసుకుంటే మరో 10 వేల ఓవర్లు ఉంటాయి. గొప్ప ఆటగాడి జీవితంలో ఏం జరిగిందో ప్రజలు అందరూ తెలుసుకోవాలి'' అని చెప్పారు.


Also Read : తొలి ప్రేక్షకుడిని నేనే, మళ్ళీ థియేటర్లలో చూడాలనుంది - శెట్టి పోలిశెట్టికి 'మెగా' అభినందన


'800' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో క్రికెటర్ సనత్ జయసూర్య, హీరో హీరోయిన్లు మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నిర్మాత వివేక్ రంగాచారి, దర్శకులు వెంకట్ ప్రభు, పా రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 


Also Read రికార్డు రేటుకు పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఓవర్సీస్ రైట్స్ - రేటు ఎంతో తెలుసా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial