దేశంలో ప్రజలు నేడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువుల వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగం ఉంది. స్వాతంత్య్ర సమరంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు. అటువంటి మహానుభావుల కథలను వెండితెరపైకి తీసుకు రావడానికి దర్శక - రచయితలు, నిర్మాతలు కృషి చేస్తున్నారు. గోండు జాతి ముద్దుబిడ్డ కొమురం భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు స్ఫూర్తితో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్, ఇప్పుడు ఓ బెంగాల్ నవల ఆధారంగా మరో చిత్రానికి స్క్రిప్ట్ అందిస్తున్నారు.


Movie Inspired By Bankim Chandra Chatterjee's Anandamath : 'వందేమాతరం' సృష్టికర్త, బెంగాలీ సాహితీవేత్త బంకిం చంద్ర ఛటర్జీ 'ఆనంద్ మఠ్' అని ఓ నవల రాశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బెంగాలీ సన్యాసి చేసిన తిరుగుబాటు అందులో ప్రధాన అంశం. అందులో బెంగాల్‌లో 1971లో సంభవించిన మహా కరువు ప్రస్తావన కూడా ఉంటుంది. 'వందేమాతరం' గేయం ఈ నవలలోనిదే. ఇప్పుడు 'ఆనంద్ మఠ్' ఆధారంగా '1770' సినిమాకు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' రైటర్ స్క్రిప్ట్ అందిస్తున్నారు.


ఆరు భాషల్లో '1770'...
'1770' సినిమాను ఈ రోజు అధికారికంగా వెల్లడించారు. తెలుగు, హిందీ సహా కన్నడ, మలయాళ, తమిళ, బెంగాలీ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్నారు. రామ్ కమల్ ముఖర్జీ కాన్సెప్ట్, క్రియేషన్‌తో వి. విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఎస్ఎస్1 ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శైలేంద్ర కుమార్, సూరజ్ శర్మ నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. 


హీరో ఎవరు?
'1770' సినిమా అయితే ప్రకటించారు గానీ... అందులో హీరో ఎవరు? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలో హీరోను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు '1770 ఏక్ సంగ్రామ్' పేరుతో హిందీలో సినిమాను తీయాలని అనుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 


Also Read : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?


'బాహుబలి' టు '1770'
'1770' చిత్రానికి దర్శకత్వం వహించనున్న అశ్విన్ గంగరాజు, ఇంతకు ముందు 'ఆకాశవాణి' చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతే కాదు... 'బాహుబలి' రెండు భాగాలకు, 'ఈగ' చిత్రానికి దర్శక ధీరుడు రాజమౌళి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆల్రెడీ భారీ సినిమాకు పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన చేతిలో దర్శకత్వ బాధ్యతలు పెట్టారని తెలుస్తోంది. 


Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ