సినిమా హాల్‌కి బయటి నుంచి ఆహారం, పానీయాలు తీసుకెళ్లకుండా నియంత్రించే హక్కు థియేటర్ యాజమాన్యానికి ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం, సినిమా హాల్ అనేది దాని యాజమాన్యానికి చెందిన ప్రైవేట్ ప్రాపర్టీ అని, అందులో నిబంధనలను విధించడానికి అతను అర్హుడని తెలిపింది.
"ఆహారం, పానీయాల ప్రవేశాన్ని నియంత్రించే హక్కు సినిమా హాల్ యజమానికి ఉంటుంది. అందుబాటులో ఉన్నవాటిని వినియోగించాలా వద్దా అనేది పూర్తిగా సినిమా ప్రేక్షకుడిపై ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకులు వినోదం కోసం హాలును సందర్శిస్తారు." అని కోర్టు పేర్కొంది.
ఒక ప్రేక్షకుడు సినిమా హాల్లోకి ప్రవేశిస్తే, అతను/ఆమె సినిమా హాల్ యజమాని విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఇది థియేటర్ యజమానికి సంబంధించిన విషయం అని తెలిపింది. సినిమా ప్రేక్షకులు తమ సొంత ఆహారం, పానీయాలను సినిమా హాళ్లలోకి తీసుకెళ్లడాన్ని నిరోధించవద్దని మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్‌లను ఆదేశించిన జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది.
"హైకోర్టు అటువంటి ఉత్తర్వును జారీ చేయడం ద్వారా అధికార పరిధిని అధిగమించింది. తాగునీరు ఉచితంగా సరఫరా చేయాలని సినిమా హాల్ యజమానులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. అలాగే శిశువులతో సినిమాకు వచ్చినప్పుడు వారికి అవసరమైన ఆహారాన్ని తీసుకెళ్లడానికి ఎటువంటి అభ్యంతరాలు చెప్పకూడదు." అని కోర్టు పేర్కొంది.
2018లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పీళ్ల బ్యాచ్‌ను కోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ సినిమా హాళ్ల ఆవరణలు పబ్లిక్ ప్రాపర్టీ కాదని, అలాంటి హాళ్లలో అడ్మిషన్‌ను సినిమా హాల్ యాజమాన్యం రిజర్వ్ చేస్తుందని వాదించారు. ఆహారాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని వాదనలో పేర్కొన్నారు.
అన్ని హాల్స్‌లో పరిశుభ్రమైన తాగు నీరు అందుబాటులో ఉండేలా చూస్తామని ఆయన తెలిపారు. బయటి నుంచి సినిమా హాళ్లలోకి ఆహారాన్ని తీసుకురావడాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.