బాలీవుడ్ లో కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా తన సంచలన రివ్యూలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఆయన ఇచ్చే రివ్యూలన్నీ ఒక్కోసారి వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. ఈ మూవీ క్రిటిక్ తాజాగా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. షారుక్ సినిమా టైటిల్ ను మార్చుతున్నారని, అలాగే సినిమాలో వివాదాలు సృష్టించిన పాట ‘బేషరమ్ రంగ్’ ఇకపై కూడా సినిమాలో కనిపించదని అన్నాడు. ఈ సినిమా విడుదలను కూడా వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారని ట్వీట్ చేశాడు.
షారుఖ్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. ఆయన చివరిగా 2018లో ‘జీరో’ సినిమాలో కనిపించారు. తర్వాత మళ్లీ ఆయన నుంచి బిగ్ అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. అయితే మధ్య మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా.. అది ఫ్యాన్స్‌కు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఒకానొక టైమ్ లో షారుక్ ఇక సినిమాల నుంచి విరామం తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. షారుక్ ను ఫుల్ లెన్త్ రోల్ లో చూడాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ కు ‘పఠాన్’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు షారుక్. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దీపికా పదుకోన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు మేకర్స్. మరోవైపు ఈ సినిమాపై విమర్శలు కూడా అప్పటి నుంచే మొదలయ్యాయి.
సినిమా టీజర్‌పై షారుక్ ఫ్యాన్స్ మినహా సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చాయి. ఇక తర్వాత విడుదలైన ‘భేషరమ్ రంగ్’ పాటతో ఈ సినిమా పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. ఈ పాటలో దీపికా పదుకోన్ కాషాయ రంగు ఉన్న దుస్తులను వేసుకోవడంపై పెద్ద దుమారమే రేగింది. ఈ సినిమాలో సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ కొన్ని హిందూ సంఘాలు మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో నిరసనకు దిగాయి. అంతేకాదు, షారుక్ ఖాన్ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు నిరసన కారులు. దీంతో ఈ మూవీ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ సినిమాను నిషేదించాలంటూ సోషల్ మీడియాలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం మాత్రం స్పందించలేదు. తాజాగా కేఆర్కే ట్వీట్ తో మళ్లీ ఈ ‘పఠాన్’ మూవీ పేరు తెరపైకి వచ్చింది. మూవీ పై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో మూవీ టైటిల్ ను మార్చడంతో పాటు బేషరమ్ రంగ్ పాటను తీసేయడం, సినిమా రిలీజ్ తేదీను వాయిదా వేస్తున్నారు అని ట్వీట్ చేశాడు కేఆర్కే. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.