నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా కూడా అధిష్టానం అక్కడ ఇన్ చార్జ్ ని నియమించింది. ఒకరకంగా ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ పక్కనపెట్టింది. ఆ స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని సపోర్ట్ చేస్తోంది. అయితే ఇంకో ఏడాదిన్నర వరకు వెంకటగిరి ఎమ్మెల్యేని తానేనంటున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. అంతేకాదు, అధికారిక కార్యక్రమాలను మరుసటి రోజే మొదలు పెట్టారు.
ఈరోజు ఉదయం ఆనం రాపూరు మండలంలో పర్యటించారు. పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. అధికారులు కూడా ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఎక్కడా ఈసారి రామనారాయణ రెడ్డి విమర్శలు సంధించలేదు. కనీసం నిన్న వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా రామ్ కుమార్ రెడ్డిని నియమించారన్న ప్రస్తావన కూడా ఆయన తేలేదు. సైలెంట్ గా పింఛన్లు ఇచ్చారు. నిన్నటి వివాదం గురించి అడిగితే సైలెంట్ గా నే వెళ్లిపోయారు.
ఆనం వ్యూహం ఏంటి..
ఆనం వెనకడుగు వేసేవారు కాదు, తగ్గే నాయకుడు అసలు కాదు. అదిష్టానం సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా ఆయన జనంలో తిరిగే మనిషి. అందుకే నేరుగా ఈరోజు ఆయన జనంలోకి వచ్చారు. పింఛన్లను పంపిణీ చేసి వెళ్లారు. సీఎం జగన్ పింఛన్లు పెంచారని చెప్పారు. ఎక్కడా జగన్ పై కానీ, ప్రభుత్వంపై కానీ ఆయన కామెంట్ చేయలేదు. ఆయనకు అవమానం జరిగిందని అనుకున్నా కూడా, నెక్ట్స్ డే ఇలా ఫీల్డ్ లోకి దిగారంటే, ఆయన పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారని తెలుస్తోంది.
నియోజకవర్గంలో పర్యటనలు..
ఆనం పర్యటనల షెడ్యూల్ కూడా విడుదలైంది. రేపు, ఎల్లుండి, ఆయన ఎక్కడెక్కడ పర్యటిస్తారు, ఏమేం చేస్తారనే విషయాలను కూడా మీడియాకి తెలియజేశారు. అయితే ఆయన కార్యక్రమాలకు ముందు ముందు అధికారులు సహకరిస్తారా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. మరోవైపు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా దూకుడుగా ఉన్నారు. వెంకటగిరిలోని అన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే నేదురుమల్లి కుటుంబ అభిమానులు ఆయన్ను కలసి ధన్యవాదాలు చెబుతున్నారు. ఆనంకి పోటీగా ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఆనం వ్యూహం ఏంటి..?
ఇప్పటికిప్పుడు ఆనం సైలెంట్ అయితే వైరి వర్గం మరింత రెచ్చిపోతుంది. వెంకటగిరిలో ఆయన తిరగకపోతే మిగతా చోట్ల ఆయన జనంలోకి వచ్చినా పట్టించుకునేవారు ఉండరు. అందుకే ఎమ్మెల్యే పదవి ఉన్నంత కాలం ఆయన జనంలో ఉండాలనుకుంటున్నారు. మరోవైపు ఆయన నియోజకవర్గాన్ని కూడా వెదుక్కునే పనిలో ఉన్నారు. వెంకటగిరిలో ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వకపోతే కచ్చితంగా ఆయన మరో నియోజకవర్గాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా వైసీపీ తరపున టికెట్ ఉంటుందని భావించలేం. సో ఆయన కచ్చితంగా పార్టీ మారాల్సి ఉంటుంది. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చార కాబట్టి, తిరిగి టీడీపీలోకి వెళ్తారని అనుకోలేం. అయితే అక్కడ ఆనంకు టీడీపీని మించిన ప్రత్యామ్నాయం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, కేంద్రం నిధుల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి, బీజేపీకి చేరువైనా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏది ఏమైనా ఆనం ముందు నియోజకవర్గాన్ని సెట్ చేసుకోవాలి, ఆ తర్వాత పార్టీపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.