మెగాస్టార్ చిరంజీవిని మరోసారి పద్మ పురస్కారం వరించనుందా? పద్మ అవార్డుల్లో అత్యున్నత పురస్కారంతో ఆయన్ను సత్కరించాలని భారత ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే... ఢిల్లీ వర్గాల నుంచి 'అవును' అని ఓ సమాధానం వస్తోంది. 


పద్మ భూషణ్ నుంచి పద్మ విభూషణ్!
చిరంజీవిని 2006లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఆయన చేసిన సేవలకు గాను, సినిమాలతో ప్రేక్షకులను కొన్నేళ్లుగా అలరిస్తున్న అందుకు గాను పద్మ పురస్కారంతో గౌరవించింది.


ఇప్పుడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే... అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి ముందు రోజు పద్మ పురస్కారాలు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రకటించబోయే పేర్లలో చిరంజీవి పేరు ఉన్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. 


కరోనా కాలంలో పెద్దన్న పాత్ర పోషించిన మెగాస్టార్
కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించింది. అన్ని రంగాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకు చిత్రసీమ ఏమీ అతీతం కాదు. ఆ కష్ట కాలంలో చిరంజీవి ముందడుగు వేశారు. ఇండస్ట్రీ ప్రముఖులను ఏకం చేసి పెద్దన్న పాత్ర పోషించారు. 


కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ఏర్పాటు చేసిన చిరంజీవి... దాని ద్వారా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు, విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు. వ్యక్తిగతంగా కొంత మందికి ఆయన సాయం చేశారు. సకాలంలో ఆక్సిజన్ లభించక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు అంబులెన్స్ సర్వీసులు నడిపారు. ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరిస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ప్రచారం మెగా అభిమానులకు అమితానందం కలిగిస్తోంది. 


తెలుగులో ఈ తరంలో అత్యధిక సినిమాలు చేసిన హీరో
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తరానికి చెందిన హీరోలు రెండు, మూడు వందల సినిమాలు చేశారు. అయితే... ప్రస్తుతం, ఈ తరంలో తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన అగ్ర హీరో చిరంజీవి అని చెప్పాలి. హీరోగా 150కు పైగా సినిమాలు చేశారాయన. ఆ తర్వాత వందకు పైగా సినిమాలతో బాలకృష్ణ ఉన్నారు. చిరంజీవి 150 సినిమాల రికార్డును కొత్త హీరోలు చేరుకోవడం అసాధ్యం అని చెప్పాలి.


Also Readజయరామ్ పెళ్లాంతో సరిగా కాపురం చేసే క్యారెక్టర్లు చేయరా?


ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే 20 శాతం సినిమా తీశారు. విజువల్ ఎఫెక్ట్స్ చేయించాల్సిన సన్నివేశాలను ముందుగా షూట్ చేశారు. 'విశ్వంభర' సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Also Readసీడెడ్, గుంటూరులో లాభాల్లోకి 'నా సామి రంగ' - నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందంటే?