టీ 20ల్లో రోహిత్‌ శర్మ(Rohit Sharma) శకం ముగిసింది. ఈ ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్‌(T20 World Cup)లో హిట్‌ మ్యాన్‌కు జట్టులో చోటు ఉంటుందా..? యువకులతో రోహిత్‌ పోటీ పడగలడా..? వన్డే ప్రపంచకప్‌(One Day International)లో జట్టును విజయంవంతంగా నడిపించిన సారధి... టీ 20 ప్రపంచకప్‌లోనూ అదే దూకుడుగా ఉండగలడా...? 14 నెలలు దూరంగా ఉన్న రోహిత్‌ను ఇంకా జట్టులోకి తీసుకోవడం సరైంది కాదు...? తొలి రెండు మ్యాచుల్లో ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరిన రోహిత్‌ శర్మపై  ఇలాంటి విమర్శలు... ప్రశ్నలు... ఎన్నో చెలరేగాయి. వీటన్నింటికీ హిట్‌ మ్యాన్‌ ఒక్క ఇన్నింగ్స్‌తోనే సమాధానం చెప్పేశాడు. తాను క్రీజులో కుదురుకుంటే  ఎంతటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌నో విమర్శలకులందరికీ చెప్పేశాడు. అఫ్గాన్‌పై విధ్వంసకర సెంచరీతో విమర్శలకు బ్యాట్‌తో సరైన సమాధానం చెప్పాడు. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు మిగిలిన ఏకైక టీ 20 మ్యాచ్‌(T20 Match)లో హిట్‌మ్యాన్‌ విశ్వరూపం చూపాడు. ఏ రికార్డు అయినా తాను దిగనంత వరకేనని ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ రోహిత్ చాటిచెప్పాడు. 


ప్రతీ సిక్సూ ఓ హెచ్చరికే..
అఫ్గాన్‌తో జరిగిన నామమాత్రమైన మూడో టీ 20లో రోహిత్‌ శర్మ ఆడిన ఇన్నింగ్స్‌ అంత తేలికైంది కాదు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు హిట్‌మ్యాన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలుత నెమ్మదిగా ఆడిన రోహిత్‌... తర్వాత తుఫానులా విరుచుకుపడ్డాడు. రోహిత్‌ శర్మ వింటేజ్‌ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. 22 పరుగులకే టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో  వున్నప్పుడు రోహిత్ విధ్వంసకర బాటింగ్‌తో అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు... 69 బంతుల్లో హిట్ మాన్ 11 ఫోర్లు.... 8 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. చివరివరకూ క్రీజులోనే నిల్చొని.. ఆకాశమే హద్దుగా దుమ్ముదులిపేశాడు. ఈ సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఒక వరల్డ్ రికార్డ్‌ని లిఖించుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. అంతేకాదు.. టీ20ల్లో రోహిత్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యి నిరాశపరిచినా రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి, ఆ ఆకలిని తీర్చుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గానూ రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. 1643 పరుగులతో రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. 1570 పరుగులతో విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు హిట్‌ మ్యాన్‌ బద్దలు కొట్టాడు. 



భారత జట్టు కొత్త చరిత్ర 
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు(Bengalure) వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌(White Wash)లు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎనిమిది సార్లు వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్‌, పాకిస్థాన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కానీ అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది.