Mansoor Ali Khan: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన తమిళ సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై చెన్నై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. థౌజండ్ లైట్స్‌ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపులతో పలు కీలక సెక్షన్ల కింద కేసు పెట్టారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే మన్సూర్ కు నోటీస్ పంపించనున్నట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.


మీడియాతో చిట్ చాట్ లో నోరు జారిన మన్సూర్


రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఆయన ‘లియో’ సినిమా గురించి ప్రస్తావించారు. అందులో భాగంగానే త్రిషతో కలిసి నటించడం పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో రేప్ సీన్ చేయకపోవడం నిరాశ కలిగించిందన్నారు. “గతంలో నేను చాలా రేప్‌ సీన్లలో నటించాను. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో రేప్‌ సీన్‌ ఉంటుందని భావించాను. అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై నటి త్రిషతో పాటు పలువురు సౌత్ సినీ ప్రముఖులు స్పందించారు. మన్సూర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  


మహిళా కమిషన్ ఆదేశాలతో కేసు నమోదు   


అటు త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమీషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. మన్సూర్ కామెంట్స్ మహిళలపై లైంగిక వేధింపులు ప్రేరేపించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. “మన్సూర్ వ్యాఖ్యల విషయాన్ని మేం చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఐపీసీ సెక్షన్‌ 509Bతో పాటు లైంగిక వేధింపులకు సంబంధించిన మరికొన్ని సెక్షన్ల కింద మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించాం. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో లైంగిక హింసకు కారణం అవుతాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం” అని మహిళా కమిషన్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు మన్సూర్ పై కేసు నమోదు చేశారు.  


మన్సూర్ పై నడిగర్ సంఘం తాత్కాలికంగా నిషేధం


మరోవైపు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం అతనిపై తాత్కాలికంగా నిషేధం విధించింది. క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అయితే, తాను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేది లేదని తేల్చి చెప్పారు మన్సూర్. తాను తప్పుగా మాట్లాడలేదని తెగేసి చెప్పారు. నడిగర్ సంఘం నాపై నిషేధం విధించి చాలా తప్పు చేసిందన్నారు. కనీసం వివరణ కోరకుండా ఈ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు.  


అటు తన వ్యాఖ్యలపై తప్పుగా ప్రచారం చేశారని మన్సూర్ అలీ ఖాన్ వెల్లడించారు. తన కెరీర్ ను నాశనం చేసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. " నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎడిట్ చేసి కొన్ని మాటలు తొలగించారు.. త్రిషాకు నేను ఇచ్చిన కాంప్లిమెంట్స్ చూపించలేదు. నా కెరియర్ ని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. నేను గతంలో చాలామంది హీరోయిన్స్ తో కలిసి పని చేశాను. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు" అని మన్సూర్ వివరించారు.


Read Also: ‘నెట్‌ఫ్లిక్స్’ నిర్ణయం కలచివేసింది, రెండుసార్లు గుండెపోటు వచ్చింది: అనురాగ్ కశ్యప్‌