Anurag Kashyap: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిల్మ్ మేకర్స్ అనురాగ్ కశ్యప్. ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ తాజాగా ది వాషింగ్టన్ పోస్ట్‌ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కీలక ప్రాజెక్టు నుంచి నెట్ ఫ్లిక్స్ సంస్థ వైదొలగడంతో తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో గుండెపోటు రావడంతో పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు వివరించారు. 


నెట్ ఫ్లిక్స్ నిర్ణయంలో ఎలాంటి లాజిక్ లేదు- అనురాగ్


2021లో ‘తాండవ్’ వివాదం అనంతరం పలు ఓటీటీల్లో విడుదలకు రెడీ అయిన చాలా వెబ్ సిరీస్ లు, సినిమాలు నిలిచిపోయాయి. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ కోసం ‘మాగ్జిమమ్ సిటీ’ని అనురాగ్ కశ్యప్ రూపొందించాలనుకున్నారు.  ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుపుకునే సమయంలో నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుడు పౌరసత్వ బిల్లుపై దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫారమ్స్ సెల్ఫ్ సెన్సార్‌ షిప్‌ అంటూ కీలక ప్రాజెక్టులను నిలిపివేడయం పై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. “‘మాగ్జిమమ్ సిటీ’ నా బెస్ట్ వర్క్.  దీని కోసం నేను ప్రాణం పెట్టి పని చేశాను. ఈ ప్రాజెక్టు నుంచి నెట్‌ ఫ్లిక్స్ వైదొలగడంలో ఎలాంటి లాజిక్ లేదు” అని అభిప్రాయపడ్డారు.    


నెట్ ఫ్లిక్స్ నిర్ణయంతో గుండె పగిలింది- అనురాగ్


'మాగ్జిమమ్ సిటీ' నుంచి నెట్ ఫ్లిక్స్ వైదొలిగిన తర్వాత పరిణామాలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని అనురాగ్ వెల్లడించారు. ప్రాణం పెట్టి పని చేసిన ప్రాజెక్టు ఆగిపోవడంతో గుండె పగిలిందని చెప్పారు. తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు వివరించారు. ఈ బాధతో ఏకంగా డిప్రెషన్‌లోకి వెళ్లి పోయినట్లు చెప్పారు. తాగుడుకు బానిస అయినట్లు చెప్పారు. అదే సమయంలో రెండుసార్లు గుండె పోటు వచ్చిందన్నారు. చివరకు తన జీవితం పూర్తిగా కోల్పోయిన ఫీలింగ్ కలిగిందన్నారు.   


గతంలోనూ అనురాగ్ కు గుండెపోటు


పౌరసత్వ బిల్లు నేపథ్యంలో అనురాగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపులు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చిన  ట్రోలింగ్ తో దేశాన్ని వదిలి వెళ్లిపోయినట్లు చెప్పారు. “పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఆ సమయంలో నా మీద, నా కుటుంబం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. బెదిరింపులు వచ్చాయి. చివరకు నా కూతురుని రేప్ చేస్తామని బెదిరించారు. వీటిని తట్టుకోలేక తన కూతురు కోసం సినిమాలను వదిలేసి విదేశాలకు వెళ్లిపోయా. ఆ బెదిరింపులు, ట్రోలింగ్స్ కారణంగా మూడేళ్లు డిప్రెషన్‏లోకి వెళ్లిపోయా. అదే సమయంలో గుండెపోటు కూడా వచ్చింది” అని తెలిపారు. 


ఇక అనురాగ్ అనురాగ్ కశ్యప్ చివరిగా 'కెన్నెడీ' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 25 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అనురాగ్ చివరి సారిగా నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి 'హడ్డీ'లో నటించారు.


Read Also: అందుకే వాటిని అన్ ఫాలో చేస్తున్నా, సోషల్ మీడియా నెగెటివిటీపై అనన్య పాండే ఆందోళన