Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఓటు అప్పీల్ కోసం రెండు టాస్కులు జరిగాయి. అందులోని మొదటి టాస్కులో ఎన్నో వాగ్వాదాల మధ్య అర్జున్ గెలిచాడు. కానీ అదే టాస్కులో ప్రియాంక.. రెండో స్థానంలో నిలిచినా.. కేవలం ఒకే బాల్ తేడాతో తను ఓడిపోయింది. ఇక ఆ తర్వాత రౌండ్‌లో శివాజీ గెలిచాడు. దీంతో అర్జున్‌తో పాటు శివాజీ కూడా ఓటు అప్పీల్ కంటెండర్ అయ్యాడు. ఇక అర్జున్, శివాజీ.. ఇద్దరూ హౌజ్‌మేట్స్ ముందు నిలబడ్డారు. వీరిద్దరిలో హౌజ్‌మేట్స్.. ఎవరికైతే మెజారిటీ సపోర్ట్ చేస్తారో వారే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కించుకుంటారు. అలా శివాజీకి అవకాశం లభించింది.


అర్జున్‌కు బిగ్ బాస్ పంచ్..
ఇప్పటికే ఓటు అప్పీల్ కోసం జరిగిన ముందు టాస్కుల్లో అర్జున్‌కు అవకాశం వచ్చింది. అప్పుడు తనతో పాటు కంటెండర్‌గా ఉన్న అమర్‌కంటే అర్జున్‌కే మెజారిటీ హౌజ్‌మేట్స్ సపోర్ట్ చేయడంతో తను ప్రేక్షకులకు ఓటు అప్పీల్ చేసుకున్నాడు. ఇక మరోసారి కూడా టాస్కులో తనే గెలిచి ఓటు అప్పీల్ కోసం నిలబడడంతో.. తనతో పాటు కంటెండర్‌గా ఉన్న శివాజీనే హౌజ్‌మేట్స్ ఓటు అప్పీల్ కోసం ఎంచుకున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా చాలా ఫన్నీగా సాగింది. నీకు ముందే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది, చేసుకున్నావు. కాబట్టి మా ఓటు శివాజీకే అంటూ హౌజ్‌మేట్స్ అంతా కలిసి శివాజీనే గెలిపించారు. దీంతో అర్జున్.. తన డోర్ మూసేసి వెళ్లిపోతుండగా.. బిగ్ బాస్ డోర్ తెరవమని ఆదేశించారు. ఆ తర్వాత వెంటనే ఇప్పుడు మూసేయండి అని అన్నాడు. అంతే కాకుండా ‘‘మీకు అనిపించినప్పుడు కాదు.. మేము చెప్పినప్పుడు చేయాలి’’ అని పంచ్ వేశాడు బిగ్ బాస్.


55 ఏళ్లు అయినా యూత్‌తో పోటీ..
ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం అంటూ తన ఓటు అప్పీల్‌ను మొదలుపెట్టాడు శివాజీ. ముందుగా తను బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. ప్రేక్షకులు వేసే ఓట్లు ఎవరు విన్నర్ అని డిసైడ్ చేస్తుంది అని గుర్తుచేశాడు. తను ఇక్కడే కాకుండా ఎక్కడైనా నమ్మే సూత్రం ఒక్కటే అని - అదే బ్రతుకు బ్రతికించు అని అన్నాడు. అందుకే హౌజ్‌లో కూడా తన తోటి హౌజ్‌మేట్స్‌కు సాయంగా ఉంటున్నానని చెప్పాడు. ఆటలో అందరికీ పోటీ ఇచ్చానని అన్నాడు. దెబ్బ తగిలినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా 11వ వారంలో కెప్టెన్ అయిన విషయాన్ని మరోసారి ప్రేక్షకులకు గుర్తుచేశాడు శివాజీ. అంతే కాకుండా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నానని కూడా ఫిక్స్ అయిపోయాడు. తాను ఒక 55 ఏళ్ల వ్యక్తి అయినా కూడా హౌజ్‌లో 24, 25 ఏళ్లు ఉన్న యూత్‌తో పోటీపడ్డానని గర్వంగా చెప్పాడు. తన కొడుకుతో చేసిన ఛాలెంజే ఇక్కడవరకు తీసుకొచ్చిందని బయటపెట్టాడు. ఇప్పటినుండి కూడా తనకు ఎంత కుదిరితే అంత.. టాస్కులు ఆడుతూ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తానని శివాజీ మాటిచ్చాడు. చివర్లో తన గేమ్ నచ్చితేనే ఓటు వేయమని స్టేట్‌మెంట్ ఇచ్చి ఓటు అప్పీల్‌ను ముగించాడు.


Also Read: యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!