ఇదేదో ఇతర భాషలను, ఇతర భాషా నటులను వ్యతిరేకిస్తూనో... వారిని అవమానిస్తూనో రాసిన ఆర్టికల్ కాదు. ఏబీపీ దేశానికి అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఎంతో ప్రేక్షకాదరణ పొందుతున్న రియాల్టీ షో 'బిగ్ బాస్'లో నిర్వాహకులు తాము పెట్టే రూల్స్‌ని తామే బ్రేక్ చేస్తున్న వైనం చూసి ఆడియన్స్ ముక్కున వేలేసుకుంటున్న వైనం గురించి కథనం.


తెలుగు మాత్రమే మాట్లాడాలంటూ రూల్స్ పెట్టిన బిగ్ బాస్


సీజన్ 1 నుండి బిగ్ బాస్ పెడుతూ వచ్చిన రూల్స్ లో ముఖ్యమైనది తెలుగు భాషలో మాత్రమే హౌస్ మేట్స్ మాట్లాడాలని. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1 నుండి ఈ రూల్‌ని స్ట్రిక్ట్ గా పాటిస్తూ వచ్చారు బిగ్ బాస్ టీమ్. సీజన్ 1లో తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోయిన ముమైత్ ఖాన్ , దీక్ష పంత్ లాంటి వాళ్లకు చాలాసార్లు వార్నింగ్లు, పనిష్మెంట్లు ఇచ్చారు. నాని హోస్ట్ చేసిన సీజన్ 2లో పూజా రామచంద్రన్, నటుడు అమిత్ తివారీలకూ తెలుగు భాషలో మాట్లాడడం లేదు అంటూ వార్నింగ్లు ఇచ్చారు. సీజన్ 3 నుండి కంటిన్యూగా నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయా సీజన్లలోనూ అలీ రైజా, మోనాల్, లోబో, హమీదా లాంటి తెలుగు మీద పట్టు లేని హౌస్ మేట్స్ ఉన్నా బిగ్ బాస్ ఊరుకునేవాడు కాదు. పక్కాగా తెలుగు లోనే మాట్లాడాలి అనే రూల్ పాటించేవారు. అలాగే ప్రతీ సీజన్ లోనూ ఇతర భాషలకు చెందిన వారూ ఒకరో ఇద్దరో మాత్రమే హౌస్ మేట్స్ ను తీసుకునేవారు. 



రెండు సీజన్లుగా పట్టు పెంచిన పరభాషా హౌస్ మేట్స్


అయితే గత రెండు సీజన్లుగా బిగ్ బాస్ తన రూల్స్ ను తానే బ్రేక్ చేసేశారు. సీజన్ 6లో మరియానా దంపతులును చూసి చూడనట్టు వదిలేసిన బిగ్ బాస్... సీజన్ 7లో పెద్దగా ఆ రూల్ పట్టించుకోలేదు. పైగా కన్నడ నటులకు పెద్దపీట వేయడం మొదలెట్టారు. గత సీజన్ లో శోభా శెట్టి చేసిన హంగామా ఇంకా ఎవరూ మర్చిపోలేదు. శుభ శ్రీ, ప్రిన్స్, యావర్ లు కన్నడం నుండి రాకపోయినా తెలుగు పై కమాండ్ లేని వారే .


ప్రస్తుత సీజన్ 8లో ఏకంగా నలుగురు కన్నడ నటులు హౌస్ లో ఉన్నారు. యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్... నలుగురూ కన్నడ నుండి వచ్చిన వారే. అలాగే ఆదిత్య ఓం హిందీకి చెందిన వ్యక్తి అయితే నైనిక సొంత గడ్డ ఒడిషా. అంటే హౌస్ లోకి 14 మంది వెళితే... అందులో ఆరుగురు పరభాషా నటులే. మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ అయిన బేబక్క, శేఖర్ బాషా ఇద్దరూ తెలుగు వాళ్ళు. దానితో ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉంటే అందులో సగం అంటే ఆరుగురు ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చిన వారే. అదృష్టం ఏంటంటే... ఈ ఆరుగురూ తెలుగులో మాట్లాడగలరు. ఇక్కడ ప్రజల మధ్య చర్చకు వస్తున్న పాయింట్ ఏమిటంటే... తెలుగు టీవీ రంగంలో, సెలబ్రిటీ స్థాయిలో ఎంతో మంది పాపులర్ వ్యక్తులు ఉండగా ఎందుకు పరభాషా నటులకు పెద్దపీట వేస్తున్నారు అని. అది ఆడియన్స్ కు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. అదేదో మొదటి నుండీ బిగ్ బాస్ ఓకే రూల్ మీద నిలబడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని సెటైర్ లు సైతం పేలుస్తున్నారు.



బిగ్ బాస్ వేసిన అసలు స్కెచ్ అదేనా


బిగ్ బాస్ షో వచ్చే మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో చాలా వరకూ ఈ మధ్య కన్నడ నటులే ఉంటున్నారు. దీనివల్ల కన్నడ ప్రాంతం నుండి కూడా సీరియల్స్ కు టీఆర్పీ వస్తుంది. అలాంటి వారితో బిగ్ 'బాస్ హౌస్'ను నింపితే ఈ షోకు అదనంగా ఇతర ప్రాంతాల నుండి టీఆర్పీ తేవచ్చు. అలాగే ఏడాది పొడవునా 'బిగ్ బాస్'కు వెళ్లి వచ్చిన వారితో మాటీవీ లో రకరకాల రియాల్టీ సో లు, స్పెషల్ ఎంటర్టైన్మెంట్ షోలు ప్లాన్ చేసుకోవచ్చు. వాటికి కూడా వేరే ఏరియాల నుండి వ్యూవర్షిప్ తెచ్చుకోవచ్చు. అందుకే బిగ్ బాస్ టీమ్, మాటీవీ కలిపి పరభాషా నటులకు బిగ్ బాస్ లో పెద్దపీట వేస్తున్నారనీ రివ్యూవర్స్ చెబుతున్నారు. అయితే ఈసారి ఏకంగా నలుగురు హౌస్ మేట్ లను కన్నడ నుండి తేవడంపై మాత్రం తెలుగు బిగ్ బాస్ లవర్స్ పెదవి విరుస్తున్నారు.