Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతుండడంతో ప్రేక్షకుల దగ్గర నేరుగా ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్‌ను కంటెస్టెంట్స్‌కు ఇస్తున్నారు బిగ్ బాస్. కానీ దానికంటే ముందు కొన్ని ఫన్ టాస్కులు ఆడాలి. ఆడి గెలిచినా కూడా ఓటు అప్పీల్‌కు కంటెండర్స్ అవుతారే తప్పా.. నేరుగా అప్పీల్ మాత్రం చేసుకోలేరు. అందుకే ఫన్ టాస్కులను కూడా సీరియస్‌గా ఆడుతున్నారు హౌజ్‌మేట్స్. ఇక తాజాగా జరిగిన టాస్కులలో అర్జున్, ప్రశాంత్‌ల మధ్య తీవ్రమైన వాగ్వాదమే జరిగింది. ముందుగా అర్జున్.. తనను కొట్టాడని ఆరోపించిన ప్రశాంత్.. ఆ తర్వాత వెంటనే మాట మార్చాడు. ఇక ఎలాగైనా గెలవాలి అని డిసైడ్ అయిన అమర్.. మరోసారి ఫౌల్ గేమ్‌ను నమ్ముకున్నాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


ఫౌల్ గేమ్‌తో గెలిచిన అమర్..
ఇక బుధవారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో రెండు ఫన్ టాస్కులు నిర్వహించాడు బిగ్ బాస్. అందులో ముందుగా శాండ్ కేక్ టాస్క్‌ను ఆడారు హౌజ్‌మేట్స్. ఈ టాస్క్‌లో వివిధ ఆకారాల్లో శాండ్ కేక్‌ను పేర్చి ఉంటాయి. వాటన్నింటిపైన ఒక చెర్రీ ఉంటుంది. ఆ చెర్రీని కిందపడకుండా హౌజ్‌మేట్స్ అంతా ఒకరు తర్వాత ఒకరుగా వచ్చి ఆ కేక్‌ను కార్డ్‌తో కట్ చేయాలి. ఎవరు కట్ చేస్తున్నప్పుడు ఆ చెర్రీ కిందపడుతుందో.. వారు ఆ రౌండ్ నుండి ఔట్ అయిపోయినట్టే. అయితే ముందుగా ఈ టాస్క్ నుండి అర్జున్ ఔట్ అయ్యి.. తరువాతి రౌండ్స్‌కు తానే సంచాలకుడిగా వ్యవహరించాడు. అమర్‌దీప్ మాత్రం ముందు నుండే కేక్‌ను కట్ చేసినట్టుగానే కనిపిస్తున్నా.. అసలు కట్ చేయకుండా టచ్ చేసి వదిలేస్తున్నాడని ప్రేక్షకులు భావించారు. అలాగే చివరి రౌండ్ వరకు వచ్చాడు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్.. ఇద్దరూ చివరి రౌండ్‌లో ఆడుతుండగా.. ప్రశాంత్ కేక్ కట్ చేస్తున్నప్పుడు చెర్రీ కిందపడడంతో.. ఈ టాస్కులో అమర్ విజేతగా నిలిచి ఓటు అప్పీల్‌కు కంటెండర్ అయ్యాడు.


అర్జున్, ప్రశాంత్‌ల గొడవ..
శాండ్ కేక్ టాస్క్ అయిపోయిన తర్వాత ఓటు అప్పీల్ కోసం మరొక టాస్క్ కన్ఫెషన్ రూమ్‌లో సిద్ధంగా ఉందని, ఆ గేమ్ ఆడాలంటే ముందుగా గార్డెన్ ఏరియాలో ఉన్న గంటను ఎవరైతే కొడతారో వారికే అవకాశం దక్కుతుందని తెలిపారు బిగ్ బాస్. దీంతో బజర్ మోగిన వెంటనే ముందుగా యావర్, ప్రశాంత్, అర్జున్.. ఒకరినొకరు తోసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అయినా ముందుగా అర్జున్ చేతికే గంట దొరికింది. అయితే పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో అర్జున్ చేయి తనకు గట్టిగా తగిలిందని, అందుకే తనను పట్టుకొని వెనక్కి లాగానని ఆరోపించాడు ప్రశాంత్. సంచాలకుడిగా ఉన్న అమర్‌దీప్‌ను నువ్వు చూడలేదా అని అడిగాడు. చాలాసేపు అవే ఆరోపణలు వినిపిస్తుండడంతో అర్జున్ సీరియస్ అయ్యాడు. ‘‘సోది చెప్పకు, నీకేం తగలలేదు, నువ్వే నన్ను పట్టుకొని వెనక్కి లాగావు’’ అని ప్రశాంత్‌పై అరిచాడు. కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కాసేపటికే ప్రశాంత్ మాట మార్చాడు. తనకు దెబ్బ తగలలేదని, అర్జున్ ముందుకు వెళ్లకూడదు అనే ఉద్దేశ్యంతో పట్టుకొని వెనక్కి లాగబోయానని అన్నాడు. ఇదంతా వింటున్న ప్రియాంకకు కోపం వచ్చింది. అర్జున్ తప్పేమీ లేదని తనకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది. అర్జున్, ప్రశాంత్‌లకు జరుగుతున్న గొడవ మధ్యలోకి ప్రియాంక రావడంతో శివాజీకి కోపం వచ్చి ప్రశాంత్‌ను పక్కకు తీసుకొచ్చాడు. ‘‘ఆ అమ్మాయికి ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి’’ అని ప్రియాంకపై కామెంట్స్ చేశాడు. ఇక ముందుగా గంట కొట్టడంతో అర్జున్.. టాస్క్ ఆడడానికి కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లాడు.


ఉల్లిపాయలు తింటేనే విన్నర్..
కన్ఫెషన్ రూమ్‌లో బిగ్ బాస్.. అర్జున్ ముందు రెండు కవర్ చేసి ఉన్న వస్తువులను పెట్టాడు. అందులో ముందుగా ఒక క్లాత్ తీసి చూడగా.. గిన్నెలో మూడు ఉల్లిపాయలు ఉన్నాయి. ‘‘ఆ మూడు ఉల్లిపాయలు తిని ఓటు అప్పీల్ కంటెండర్ అవుతారా? లేదా ఇంకొక క్లాత్ కింద ఏముంటే అది చేస్తారా’’ అని బిగ్ బాస్ అడగగా.. మూడు ఉల్లిపాయలు తింటానని అర్జున్ ఒప్పుకున్నాడు. అర్జున్.. అవి తింటున్న సమయంలో బిగ్ బాస్ తనతో జోకులు వేశాడు. ‘‘తిండికి సంబంధించిన టాస్కులు మీకే ఎందుకు వస్తున్నాయంటారు?’’ అని అడిగాడు. దున్నపోతులాగా ఉంటానని నాకే ఇస్తున్నారేమో అంటూ తనపై తాను జోక్ వేసుకున్నాడు అర్జున్. సక్సెస్‌ఫుల్‌గా మూడు ఉల్లిపాయలు తినేసి ఓటు అప్పీల్‌ను అమర్‌దీప్‌తో పోటీ పడే కంటెండర్ అయ్యాడు.


Also Read: ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!