ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సైతం నివాళులు అర్పిస్తూ.. సిరివెన్నెలతో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. 


''తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశల వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు. 

 

బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహం తీసుకురానున్నారు. ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. బుధవారం ఉదయం 5 గంటల వరకూ కిమ్స్ హాస్పిటల్లోనే సిరివెన్నెల భౌతికకాయం ఉండనుంది. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు.. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నారు.

 


విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు చేంబోలు సీతారామశాస్త్రి. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ చదవడం కోసం కాకినాడ వెళ్లారు. ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. తెలుగు భాషపై మంచి గ్రిప్ ఉండడంతో.. ఎంఏ చదువుతుండగానే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు. ఈ సినిమాతో గీతరచయితగా సీతారామ శాస్త్రికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన.. పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సాధించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.