తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటల్లోని సాహిత్యం మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంటుంది. ఆయన మూడు వేలకు పైగా పాటలు రాసినప్పటికీ.. సీతారామశాస్త్రి అనగానే వెంటనే గుర్తొచ్చే పాట.
'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం.. మారదు కాలం..
దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోనీ
మారదు లోకం.. మారదు కాలం..'
ఈ అక్షరాలన్నీ సత్యాలే.. 1993లో విడుదలైన 'గాయం' సినిమాలోని ఈ పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీతారామశాస్త్రి గారి సాహిత్యంలో ప్రతీ పదం తూటాల పేలుతుంటుంది.
కొన్ని పాటలు మాత్రం మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. దానికి ఉదాహరణగా 'కొత్తబంగారు లోకం' సినిమాలో ఓ పాట గురించి చెప్పుకోవచ్చు.
'నీ ప్రశ్నను నీవే ఎవ్వరూ బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మయినా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా'
ఈ పాట వింటే ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. తప్పకుండా ముందుకు సాగగలమనిపిస్తుంది. ఆ పద సంపదకు ఉన్న గొప్పతనం అలాంటిది.
నారా రోహిత్ నటించిన 'రౌడీ ఫెలో' సినిమా కోసం ఓ పాట రాశారు సిరివెన్నెల.
'పేరుకు ఇందరు జనం
పేరుకుపోయిన ఒంటరితనం
నరనరమున పిరికితనం
ప్రశ్నిస్తే జవాబు మనం'
ఈ నాలుగు లైన్లు.. తన మనసుకి దగ్గరగా ఉంటాయని చెబుతుంటారు నారా రోహిత్.
మారుతున్న కాలంతో తన కలం నుంచి వచ్చే పదాల్ని కూడా అప్డేట్ చేసుకుంటూ.. సరికొత్త సాహిత్యంతో అలరించారు సీతారామశాస్త్రి. ఆ సాహిత్యం ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసి అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి