కమెడియన్​గా పలు సినిమాల్లో నటించిన వెల్డండి వేణు, ‘జబర్దస్త్‘ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యారు. చాలా రోజుల పాటు ‘జబర్దస్త్’ వేదికపై చక్కటి కామెడీ పంచారు. బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు టీవీ షోల ద్వారా ఆడియెన్స్ ను అలరించారు. నెమ్మదిగా బుల్లితెర నుంచి వెండితెర వైపు అడుగులు వేశాడు. దర్శకుడిగా మారి ‘బలగం’ సినిమాను తెరకెక్కించారు.


‘బలగం’తో సంచలన విజయం


‘బలగం’ చిత్రంతో వేణు దశ తిరిగిపోయింది. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఊరూరా, వాడవాడా స్ర్కీన్స్ ఏర్పాటు చేసి మరీ జనాలు ఈ సినిమాను చూశారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అలకల కలబోతతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ లో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ తో పాటు..ప్రతీ పాత్రకు నటీనటులు వంద శాతం ప్రాణం పోశారు. ‘బలగం’ సినిమాకు పాత్రలు ఒక ఎత్తు అయితే.. భీమ్స్ సంగీతం మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. సినిమా సక్సెస్ లో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాతో వేణు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి పలు అవార్డులు, రివార్డులు కూడా లభించాయి.  


రెండోసారి తండ్రి అయిన వేణు


ఇక తాజాగా వేణు తన అభిమానులతో ఓ సంతోషకరమైన వార్తను పంచుకున్నాడు. తాను మరోసారి తండ్రి అయినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు పాప పుట్టిందని చెప్తూ, చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. “ఆడబిడ్డ పుట్టింది. ఇంతటి గొప్ప శుభవార్తను నా బలగంతో పంచుకునేందుకు సంతోషంగా ఉంది” అని రాసుకొచ్చారు. వేణు పోస్టుకు నెటిజన్లతో పాటు పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. వేణు ఇంటికి మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డ వచ్చిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. నిజానికి వేణుకు ఇప్పటికే ఓ అబ్బాయి ఉన్నాడు. పేరు రేవంత్. ఇద్దరు కలిసి యూట్యూబ్  వీడియోలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు రెండోసారి ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు.   






దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా!


అటు ‘బలగం’ సినిమా తర్వాత వేణు తన తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, తొలి సినిమాకు అవకాశం కల్పించిన దిల్ రాజు నిర్మాణ సారథ్యంలోనే మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఓ స్టార్ హీరోతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి కథ పూర్తి అయినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Read Also: బాక్సాఫీస్ దగ్గర 'భగవంత్ కేసరి' డీలా, 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial