తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకుని అంతర్జాతీయ సినిమా వైపు చూసే ధైర్యం, దారి చూపించిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి... మరోసారి మన తెలుగు, భారతీయ సినిమా ప్రేక్షకులు కాలర్ ఎగరేసేలా చేశారు. 'ఆర్ఆర్ఆర్' (RRR Movie)తో మరో అరుదైన ఘనత సాధించారు. మరో చరిత్ర సృష్టించడానికి రెండు అడుగుల దూరంలో నిలిచారు.


'బాఫ్టా' లాంగ్‌లిస్ట్‌లో 'ఆర్ఆర్ఆర్'
అమెరికన్లకు ఆస్కార్ ఎలాగో... బ్రిటీషర్లకు బాఫ్టా అవార్డులు (BAFTA Awards) అలాగ! బ్రిటిష్ సినీ ప్రముఖులు, అక్కడి ప్రేక్షకులు 'బాఫ్టా'ను అత్యున్నత పురస్కారంగా భావిస్తారు.


ప్రతి ఏడాది బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డులు ఇస్తోంది. అందులో ఈ ఏడాది నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'ను కన్సిడర్ చేశారు. ఐదు సినిమాలకు నామినేషన్స్ లభిస్తాయి. నామినేషన్స్ కంటే ముందు పది సినిమాలను లాంగ్‌లిస్ట్‌ చేశారు. బాఫ్టాలో సభ్యులు ఓట్లు ఏయే సినిమాలకు ఎక్కువ పడతాయో... ఆ సినిమాలు నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంటాయి. 


ప్రస్తుతానికి బాఫ్టా లాంగ్‌లిస్ట్‌లో నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'కు చోటు లభించింది. మొత్తం 49 సినిమాలను దాటుకుని వచ్చిన పది సినిమాల్లో మన 'ఆర్ఆర్ఆర్' ఒకటి కావడం గర్వకారణం. నామినేషన్ వస్తుందా? లేదా? ఈ నెల 19న తెలుస్తుంది. ఆ రోజు అనౌన్స్ చేస్తారు. పురస్కరాలను ఫిబ్రవరి 19న ప్రదానం చేస్తారు. 


విశేషం ఏమిటంటే... బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఇద్దరు భారతీయ స్వాతంత్య్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహాజనిత కథతో రాజమౌళి సినిమా తీశారు. ఆ సినిమాను బ్రిటీషర్లు గుర్తించడం, అవార్డుకు కన్సిడర్ చేయడం విశేషం.
  
ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' సినిమా ఆస్కార్ అవార్డుల్లో చోటు దక్కించుకుంది. అకాడమీ అవార్డ్స్ (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్) లో 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్స్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన పదిహేను పాటల్లో 'నాటు నాటు...' సాంగ్ ఒకటి. వీటిలో ఐదు పాటలు నామినేషన్స్‌కు వెళతాయి. ఆ ఐదింటిలో ఒకటి విన్నర్‌గా నిలుస్తుంది. విజేతగా నిలవడానికి 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' రెండు అడుగుల దూరంలో ఉంది. 






జనవరి 24, 2023లో ఆస్కార్ నామినేషన్స్ వెల్లడిస్తారు. మార్చి 23, 2023న విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ జరగనుంది. ఇటీవల న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు 'ఆర్ఆర్ఆర్' వెళుతోంది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.


Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?


లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అవార్డుల్లో 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' అవార్డు ఎంఎం కీరవాణికి దక్కింది. బోస్టన్ సొసైటీ నుంచి కూడా ఆయనకు అవార్డు వచ్చింది. లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్, సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి విభాగంలో ఎస్.ఎస్. రాజమౌళి రన్నరప్‌గా నిలిచారు. అంతకు ముందు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి కూడా 'ఆర్ఆర్ఆర్' అవార్డు అందుకుంది. 'ఆర్ఆర్ఆర్' కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు స్పాట్ లైట్ విన్నర్ అవార్డు వచ్చింది. 'బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్'గా అవార్డులు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'కు, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్, సన్‌సెట్ సర్కిల్, శాటన్ అవార్డుల్లో కూడా అదే విభాగంలో అవార్డు ఇచ్చింది.


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.


Also Read : వీర సింహా రెడ్డి చరిత్రలో నిలిచిపోతుంది - నేనెప్పటికైనా చేయాలనుకునే సినిమా అదే: నందమూరి బాలకృష్ణ