వెబ్ సిరీస్ రివ్యూ : 3Cs - Choices, Chances, and Changes
రేటింగ్ : 1/5
నటీనటులు : నిత్యా శెట్టి, జ్ఞానేశ్వరి కండ్రేగుల, స్పందన పల్లి, రామ్ నితిన్, సంజయ్ రావ్, అప్పాజీ అంబరీష, శాంతను, సందీప్ వేద్, సోనమ్ చౌరాసియా, వీరేన్ తంబిదొరై తదితరులు
ఛాయాగ్రహణం : అభిరాజ్ నాయర్
నేపథ్య సంగీతం : సునీల్ కశ్యప్
నిర్మాతలు : సుహాసిని రాహుల్, జి. రాహుల్ యాదవ్
రచన, దర్శకత్వం : సందీప్ కుమార్ తోట
విడుదల తేదీ: జనవరి 5, 2023
ఓటీటీ వేదిక : సోనీ లివ్
ఎన్ని ఎపిసోడ్స్ : ఆరు (ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు 25 నిమిషాలు)
'అంజి', 'దేవుళ్ళు'లో బాలనటిగా కనిపించిన నిత్యా శెట్టి ఇప్పుడు కథానాయికగా వెబ్ సిరీస్, సినిమాలు చేస్తున్నారు. ఆమెతో పాటు జ్ఞానేశ్వరి కండ్రేగుల, స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ '3 సిస్' (3Cs Web Series). సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది. జనవరి తొలి వారంలో వచ్చిన తొలి తెలుగు వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంది (3Cs Review In Telugu)?
కథ (3Cs Web Series Story) : చైత్ర రంగనాథన్ (స్పందన పల్లి)కి పెళ్లి. దానికి ముందు ఇంట్లో శుభకార్యానికి స్కూల్‌మేట్ చంద్రిక (నిత్యా శెట్టి) వస్తుంది. మరో స్కూల్‌మేట్ కేథరిన్ సంగం వేరోనికా (జ్ఞానేశ్వరి)ని ఇద్దరూ కలుస్తారు. చంద్రిక ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే, వేరే అమ్మాయితో అతడు సన్నిహితంగా ఉండటం చూసి సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తుంది. ఓదార్చే క్రమంలో ఆమెతో పాటు స్కూల్‌మేట్స్ ఇద్దరూ కూడా అప్‌కమింట్ యాక్ట్రెస్ దియా (సోనమ్ చౌరాసియా) డ్రగ్స్ కలిపి ఇచ్చిన వోడ్కా తాగుతారు. కట్ చేస్తే... తెల్లారే సరికి అండమాన్‌లో ఉంటారు. అదీ క్రూజ్‌లోని మూడు లక్షల రూపాయల సూట్ రూమ్‌లో! మిడ్ నైట్ 12 వరకు హైదరాబాద్‌లో ఉన్న అమ్మాయిలు మూడు గంటలకు అండమాన్ ఎలా వచ్చారు? చైత్రకు కాబోయే వాడు సుజిత్ (రామ్ నితిన్)ను గే ప్రాస్టిట్యూషన్ రాకెట్‌కు అమ్మేసింది ఎవరు? అండమాన్ నుంచి మళ్ళీ ముంబైకు ఎందుకు వెళ్ళారు? అక్కడ బడే బాయ్ అలియాస్ శార్దూర్ ఠాకూర్ (వీరేన్ తంబిదొరై), అండమాన్ నుంచి వచ్చిన స్మగ్లింగ్ కింగ్ బాబ్ (సందీప్ వేద్) ఎందుకు అమ్మాయిల వెంట పడ్డారు? అనేది సోనీ లివ్ ఓటీటీలో వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ : హాలీవుడ్ హిట్ సినిమా 'హ్యాంగోవర్' గుర్తు ఉందా? పోనీ, 'అల్లరి' నరేష్ హీరోగా వచ్చిన 'యాక్షన్ త్రీడీ' సినిమా? సేమ్ టు సేమ్... ఈ వెబ్ సిరీస్ కూడా అంతే! '3 సిస్' మీద ప్రతి సన్నివేశంలో 'హ్యాంగోవర్' ప్రభావం కనబడుతుంది. ఆ సినిమా స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్ తీశారు. కాకపోతే... క్యారెక్టర్స్ జెండర్ స్వైప్ చేశారు. అబ్బాయిల బదులు అమ్మాయిలను మెయిన్ లీడ్స్ చేశారు.
'3 సిస్' రచయిత, దర్శకుడు సందీప్ కుమార్ తోటను ఒకే ఒక్క విషయంలో మనం మెచ్చుకోవాలి. 'హ్యాంగోవర్' క్యారెక్టర్స్ మన నేటివిటీకి తగ్గట్టు కాస్త జెండర్ స్వైప్ చేసినందుకు! చేస్తే ఆడియన్స్ గుర్తు పట్టలేరని, కొత్తగా ఉంటుందని కాన్ఫిడెన్స్‌తో తీసినందుకు! మిగతా విషయాల్లో ప్రేక్షకుల ఓపికను సందీప్ కుమార్ తోట గట్టిగా పరీక్షించారు. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ వర్కవుట్ చేయడంలో కింద మీద పడ్డారు. అసలు, కొన్ని అంటే కొన్ని సన్నివేశాల్లో ఆ కామెడీ వర్కవుట్ అయ్యింది. యాక్టర్స్ నుంచి తనకు కావాల్సింది తీసుకోవడంలో కూడా తడబడ్డారు. చాలా మందితో ఓవర్ యాక్టింగ్ చేయించారు.
నిజానికి... '3 సిస్'లో డార్క్, స్లాప్‌స్టిక్ కామెడీకి బోలెడు స్కోప్ ఉంది. సిరీస్ మీద ఏ మూవీ ఇన్స్పిరేషన్ ఉందనేది పక్కన పెడితే... మెయిన్ లీడ్స్, ఆర్టిస్ట్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. సమయం, సందర్భం లేకుండా... అసలు ఎక్కడ ఉన్నామనేది ఆలోచించకుండా నిత్యా శెట్టి రోల్ మనసులో అనిపించింది చెప్పేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఏం అనుకుంటారోనని తనకు నచ్చింది చేయకుండా కాంప్రమైజ్ అయ్యే అమ్మాయి రోల్ స్పందన పల్లి చేశారు. ప్రాక్టికాలిటీకి దగ్గరగా జ్ఞానేశ్వరి క్యారెక్టర్ ఉంటుంది. మధ్యలో గే ప్రాస్టిట్యూషన్ ఒకటి. వీళ్ళకు తోడు క్రైమ్, ముంబై రౌడీలు... కథాకమామీషు చాలా ఉంది.
బిర్యానీకి అవసరమైన సరుకులు అన్నీ ఉంటే సరిపోతుందా? వాటిని తీసుకుని రుచిగా వంట చేసి పెట్టే షెఫ్ కూడా కావాలిగా! '3 సిస్' కథలో అన్నీ ఉన్నాయి. కానీ, ప్రేక్షకుడిని నవ్విస్తూ, తర్వాత ఏం జరుగుతుందోనని ఆసక్తిగా తీయగల దర్శకుడు లేకపోవడంతో కంగాళీ అయ్యింది. టెక్నికల్ పరంగా అభిరాజ్ నాయర్ కెమెరా వర్క్ బావుంది. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం, ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభంలో వచ్చే పెళ్లి పాట కూడా! కానీ, ఆ సన్నివేశాలు ఎవరి వర్క్ మీద కాన్సంట్రేట్ చేయకుండా చేశాయి. ఖర్చు విషయంలో చాలా పరిమితులు ఉన్నట్టు సిరీస్ చూస్తుంటే అర్థం అవుతుంది.
నటీనటులు ఎలా చేశారంటే? : ముగ్గురు అమ్మాయిల్లో స్పందన పల్లి నటన కాస్త నమ్మేలా ఉంది. జ్ఞానేశ్వరి నటనకు, ఆ డబ్బింగుకు అసలు సంబంధమే లేదు. పక్కన ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నిత్యా శెట్టికి అమాయకపు అమ్మాయి పాత్ర దొరకడంతో ఓవర్ యాక్టింగ్ చేశారు. యూట్యూబ్ ఫిల్మ్స్, 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ చేసిన రామ్ నితిన్ తన పాత్రకు న్యాయం చేశారు. సంజయ్ రావ్ క్యారెక్టర్, యాక్టింగ్ కూడా పర్వాలేదు. మిగతా వాళ్ళలో ఎవరికీ గుర్తుండే క్యారెక్టర్లు గానీ, బాగా నటించే సన్నివేశాలు గానీ పడలేదు.
Also Read : 'దిల్' రాజు ఒక్కడూ ఒకవైపు - బడా నిర్మాతలు మరోవైపు?
చివరగా చెప్పేది ఏంటంటే? : '3 సిస్' వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత 'మనకు ఇది చూడటం తప్ప వేరే ఛాయస్ లేదా?' అనే ఆలోచన వస్తుంది. వేరే ఛాన్సెస్ ఏం ఉన్నాయి? అనిపిస్తుంది. ఆ తర్వాత చేంజ్ చేయాలనిపిస్తుంది. 'హ్యాంగోవర్' కాన్సెప్ట్ తీసుకుని అమ్మాయిలతో తీస్తే జనాలు చూస్తారని అనుకోవడం తప్ప... ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం '3 సిస్'లో తక్కువ కనబడుతుంది.
'వాళ్ళు మీకు అర్థం ఏమిటో తెలియకుండా ప్రేమించడం కంటే... కనికరం లేని కాలం చెవితో ఆ హృదయాన్ని బంధించడం మంచిది' - జ్ఞానేశ్వరి క్యారెక్టర్ చెప్పే డైలాగ్. ఎవరో మహాకవి అన్నాడట. ఈ డైలాగ్ అర్థం అయితే, అర్థం చేసుకునే మహా మేధావులకు మీకు '3 సిస్' సిరీస్ కూడా అర్థం అవుతుంది. మిగతా వాళ్ళు మరో ఆలోచన లేకుండా స్కిప్ కొట్టేయడం మంచిది.
Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?