చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని గతంలో కొందరు నిర్మాతలు రోడ్డుకు ఎక్కారు. ఇప్పుడు చిన్న సినిమాల సంగతి దేవుడు ఎరుగు, స్టార్ హీరోల చిత్రాలకు థియేటర్లు లభించని పరిస్థితి చూస్తున్నామని ఇండస్ట్రీలో బడా బడా నిర్మాతలు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఆ నలుగురు కంట్రోల్ చేస్తున్నారని కొందరు నిర్మాతలు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు అన్ని వేళ్ళూ ఒక్క 'దిల్' రాజు వైపు చూపిస్తున్నాయి. పరిశ్రమలో వ్యక్తులు కాదు, సామాన్య ప్రేక్షకులు సైతం సోషల్ మీడియాలో 'దిల్' రాజుపై కామెంట్స్ చేస్తుండటం విశేషం. 


సంక్రాంతి బరిలో ఆరు సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి', తమిళ దళపతి విజయ్ 'వారసుడు', అజిత్ 'తెగింపు' పెద్ద సినిమాలు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన 'విద్యా వాసుల అహం', సంతోష్ శోభన్ 'కళ్యాణం కమనీయం' చిన్న సినిమాలు. ఏ ఏరియాలో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు లభిస్తున్నాయి? ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. 


'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలకు తన 'వారసుడు' పోటీ కాదంటూనే తన సినిమా కోసం థియేటర్లు బ్లాక్ చేశారని డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ టాక్. ఆ ఒక్కటే కాదు... అజిత్ 'తెగింపు'ను తెలుగు రాష్ట్రాల్లో 'దిల్' రాజు సంస్థ ద్వారా విడుదల అవుతోంది. యువి క్రియేషన్స్ నిర్మించిన 'కళ్యాణం కమనీయం'ను తెలుగులో కొన్ని ఏరియాల్లో ఆయన విడుదల చేస్తున్నారు. తన సినిమాలకు తప్ప వేరే సినిమాలకు (దీని అర్థం చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు) థియేటర్లు ఇచ్చే ఉద్దేశం ఆయనకు లేదని ఇండస్ట్రీలో కొందరు బాహాటంగా చెబుతున్నారు. 


Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?


రీసెంట్ 'దిల్' రాజు ఇంటర్వ్యూలు చూసినా ఆ విషయమే స్పష్టం అవుతోంది. ఓ డిస్ట్రిబ్యూటర్ ఏ విధంగా ఆలోచించాలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. 'శతమానం భవతి', 'ఎఫ్ 2' సినిమాలను దొరికిన థియేటర్లలో వేశామని, టాక్ వచ్చాక అవి భారీ విజయాలు సాధించాయని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో 'నరసింహ నాయుడు' 14 స్క్రీన్లలో విడుదల అయితే... 'మృగరాజు', 'దేవి పుత్రుడు' ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ అయ్యాయని, చివరికి 'నరసింహ నాయుడు' విజయం సాధించిందని గుర్తు చేశారు.
 
'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు... నైజాంలో రెండు సినిమాలను పంపిణీ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ విషయమై వాళ్ళు తనతో డిస్కస్ చేయలేదని 'దిల్' రాజు కుండ బద్దలుకొట్టారు. ఉత్తరాంధ్రలోని 165లో తన థియేటర్లు 35 మాత్రమే అంటున్న ఆయన, తన థియేటర్లలో వేరే సినిమా వేసే ప్రసక్తి లేదని తేల్చేశారు. గొడవ సంక్రాంతి సినిమాలతో ముగియలేదు. మహాశివరాత్రికి కూడా కంటిన్యూ అవుతోంది.


సంక్రాంతి సినిమాలు ఇంకా విడుదల కాక ముందే... మహాశివరాత్రి కాక మొదలు అయ్యింది. సాధారణగా ఫిబ్రవరిని డ్రై సీజన్ అంటుంటారు. సంక్రాంతికి ఎక్కువ సెలవులు ఉండటం, పండక్కి ప్రజలు అందరూ ఎంజాయ్ చేసి ఉండటంతో ఆ తర్వాత నెలలో ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రారని చెబుతూ ఉంటారు. పెద్ద సినిమాలు రావడం తక్కువ. మీడియం బడ్జెట్ సినిమాలు వస్తాయి. అయితే, ఈ ఫిబ్రవరి 18న మహాశివరాత్రి ఉంది. ఆ రోజు సెలవు ఉంటుంది.


ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన 'సార్' సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ', విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమాలను ఫిబ్రవరి 17న మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్టు ముందుగా ప్రకటించారు. అనూహ్యంగా మహాశివరాత్రి రేసులోకి సమంత 'శాకుంతలం' సినిమాను 'దిల్' రాజు తీసుకొచ్చారు. దీని వెనుక ఇండస్ట్రీలో గొడవలే అని గుసగుసలు ఉన్నాయి. 


Also Read : జనవరిలో తెలుగు థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవో చూడండి 


డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో 'దిల్' రాజు ఆరితేరిన వ్యక్తి. కొన్ని సినిమాలతో ఆయన డబ్బులు సంపాదించిన రోజులు ఉన్నాయి. అలాగే, భారీ పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. 'దిల్' రాజుతో మనస్పర్థలు రావడంతో మైత్రీ మూవీ మేకర్స్ కొత్తగా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిందని వినికిడి. హారిక అండ్ హాసిని, సితార అధినేతలతో కూడా ఆయనకు పడటం లేదట. అందుకని, వాళ్ళకు పోటీగా తన సినిమాలను తీసుకొస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
 
ఇప్పుడు 'దిల్' రాజు ఒక్కడూ ఒకవైపు... చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న బడా నిర్మాతలు మరోవైపు అన్నట్టు ఇండస్ట్రీ కోల్డ్ వార్ జరుగుతోంది. మంచి సినిమా తీయడమే కాదు... రిలీజ్ విషయంలో మంచి డేట్ చూసుకోవడం కూడా ముఖ్యమే. పోటీలో మరో సినిమా లేకుండా చూసుకోవడం అంత కంటే ముఖ్యం. పోటీలో ఏ సినిమా లేనప్పుడు ఏవరేజ్ సినిమా కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. పోటీలో మూడు నాలుగు సినిమాలు ఉన్నప్పుడు హిట్ సినిమా కూడా తక్కువ కలెక్ట్ చేస్తుంది. ఈ విషయం నిర్మాతలకు తెలియనిది కాదు. కానీ, కొన్ని కొన్ని కారణాల వల్ల పోటీలో సినిమాలు విడుదల చేయక తప్పడం లేదు.


Also Read : ఫిబ్రవరిలో ఒకే రోజు నాలుగు సినిమాలు - మళ్లీ థియేటర్ల రచ్చ? 


సంక్రాంతి, మహాశివరాత్రికి వస్తున్న సినిమాల్లో ఏది హిట్ అవుతుందో? ఏవరేజ్ టాక్ వచ్చినా పోటీలో మరో హిట్ సినిమా ఉండటంతో ఏది బలి అవుతుందో? 'దిల్' రాజును ఢీ కొట్టడం అంత సులభం కాదని ఇండస్ట్రీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట.