ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల అంశంపై ఏ క్షణమైనా జీవో విడుదలయ్యే అవకాశం ఉంది.  సినిమా టికెట్‌ ధరల విషయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ గురువారం నాలుగో సారి సమావేశమైంది.  రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన కమిటీ తాజాగా సమావేశమై టికెట్‌ ధరలపై తుది ప్రతిపాదనలు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. థియేటర్ క్యాంటీన్లలో ధరలు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు సంబంధించి టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రతిపాదనలు, ఐదో షో వేసేందుకు అనుమతి వంటి అంశాలపై చర్చించారు.  


ప్రజలు, సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలకు మేలు చేకూరేలా సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వానికి మేము ఒక నివేదికను అందిస్తామని కమిటీ సభ్యులు ప్రకటించారు.  ఎప్పుడైనా టికెట్‌ ధరలపై ప్రభుత్వం నుంచి జీవో వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  3 స్లాబ్‌లలో టికెట్‌ల ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంచాయతీ, నగర పంచాయతీలు ఒకటో కేటగిరి, మున్సిపాలిటీ లను రెండవ కేటగిరీ, కార్పోరేషన్‌లను మరో క్యాటగిరిగా గుర్తించి టికెట్ ధరల నిర్ణయానికి కమిటీ సిఫార్సు చేసింది. టికెట్ల ధరల్లో 2 కేటగిరీలు మాత్రమే ఉంచాలని  ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టికెట్ రేట్లపై  ఏపీ  సర్కార్ ఓ  నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కమిటీ సభ్యుల సిఫార్సులు, ప్రభుత్వ రేట్లపై నేటి భేటీలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.


తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. టిక్కెట్ల జీవో ఇచ్చిన మరుక్షణం సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. భీమ్లా నాయక్ సినిమా మరో వారంలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వం జీవో ఇస్తుందా లేదా అన్న టెన్షన్ ఆ సినిమా నిర్మాతలకు ఉంది. ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అవన్నీ ఏపీ ప్రభుత్వం ఇచ్చే జీవో కోసం ఎదురు చూస్తున్నాయి. 


కమిటీ నివేదికతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమకు ఏమేమి మేలు చేస్తామో చెబుతూ సీఎం జగన్ ఇప్పటికే సినీ ప్రముఖులకు ఓ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి నేతృత్వంలో వచ్చి కలిసిన వారికి టిక్కెట్ రేట్ల పెంపుతో పాటు ఐదో షోకు కూడా అనుమతి ఇస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు వాటితో పాటు కొత్తగా ఏమైనా ప్రయోజనాలు కల్పిస్తారా లేకపోతే కొత్తగా ఏమైనా రూల్స్ పెడతారా అన్నది జీవోలు విడుదలయ్యాకా కానీ స్పష్టత ఉండదు.