Rohit Sharma class to Ishan Kishan: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్లాస్‌ తీసుకున్నాడు! వెస్టిండీస్‌తో తొలి టీ20లో అతడి బ్యాటింగ్‌ ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేకపోవడమే ఇందుకు కారణం. నెమ్మది పిచ్‌లపై వేగంగా ఆడలేకపోవడంతో కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ను చాలా మంది విమర్శిస్తున్నారు. ఎప్పుడో ముగించాల్సిన మ్యాచును అతడివల్లే ఆలస్యమైందని అంటున్నారు. ఎప్పుడూ దూకుడుగా ఆడే అతడు ఈ సారి రక్షణాత్మకంగా ఆడాడని పేర్కొన్నారు. ఈ మ్యాచులో 42 బంతులు ఆడిన ఝార్ఖండ్‌ డైనమైట్‌ 35 పరుగులే చేశాడు. కేవలం 4 బౌండరీలే ఉన్నాయి. ముంబయి ఇండియన్స్‌లో రోహిత్‌, ఇషాన్‌ కలిసి ఆడే సంగతి తెలిసిందే. అతడి బలహీనతలు తెలిసిన హిట్‌మ్యాన్‌ మ్యాచ్‌ ముగిశాక కొన్ని సలహాలు ఇచ్చాడు.


'చాలా రోజుల నుంచి నేను ఇషాన్‌తో మాట్లాడుతున్నాను. ముంబయి ఇండియన్స్‌లో మిడిలార్డర్‌లో ఆడుతున్నప్పటి నుంచీ అతడి ఆటతీరు నాకు తెలుసు. ఎందుకంటే సాధారణంగా అతడా స్థానంలో ఆడడు. అందుకే నెమ్మదిగా, మందకొడిగా ఉండే చెన్నై పిచ్‌లపై అతడు ఇబ్బంది పడ్డాడు. పరుగులు చేయలేదు. మిడిల్‌లో వచ్చినప్పుడు స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం ముఖ్యం. టీమ్‌ఇండియాలో అతడికి ఇప్పుడిప్పుడే అవకాశాలు దొరుకుతున్నాయి. ఇక్కడ మరింత ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు నిలవడం కీలకం. అతడు సౌకర్యంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడం మా బాధ్యత' అని రోహిత్‌ శర్మ అన్నాడు.


అచ్చొచ్చిన ఈడెన్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ నిర్దేశించిన 158 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్ల తేడాతో మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (40; 19 బంతుల్లో 4x4, 3x6) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇషాన్‌ కిషన్‌ (35; 42 బంతుల్లో 4x4) ఫర్వాలేదనిపించాడు. సూర్యకుమార్‌ (34*; 18 బంతుల్లో 5x4, 1x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (24*; 13 బంతుల్లో 2x4, 1x6) మెరుపులు మెరిపించాడు. అంతకు ముందు విండీస్‌లో నికోలస్‌ పూరన్‌ (61; 43 బంతుల్లో 4x4, 5x6) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. కైల్‌ మేయర్స్‌ (31; 24 బంతుల్లో 7x4), కీరన్‌ పొలార్డ్‌ (24*; 19 బంతుల్లో 2x4, 1x6) అతడికి అండగా నిలిచారు.