చాక్లెట్ అనగానే అదేదో పిల్లల ఆహారంలా చూస్తారు కానీ పెద్దలకు కూడా అది చాలా అవసరం. మానసిక శక్తిని, ఉల్లాసాన్ని వెంటనే పెంచే ఒక క్లాసిక్ ట్రీట్ ఇది. ప్రతిరోజూ చిన్న చాక్లెట్ ముక్క తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అలా అని మరీ అధికంగా తినకూడదు. సాధారణ చాక్లెట్ తో పోలిస్తే డార్క్ చాక్లెట్‌ను తింటే మరీ మంచిది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 


బరువు తగ్గేందుకు 
బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు రోజూ చాక్లెట్ ముక్కను కచ్చితంగా తినాలి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్ లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆకలి కోరికలు తగ్గుతాయని, తద్వారా ఇతర ఆహారం తక్కువగా తింటారని తేలింది. ఇది ఆయిలీ ఫుడ్స్, ఉప్పు, కారంగా ఉండే ఆహారాలను తినాలన్న కోరికలను తగ్గిస్తుందని కూడా తెలిసింది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే రోజూ డార్క్ చాక్లెట్ ముక్కను తినండి. 


గుండె ఆరోగ్యానికి
గుండె పోటు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాన్ని చాక్లెట్ తగ్గిస్తుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం డార్క్ చాక్లెట్ మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మూడింట ఒక వంతు తగ్గించుకోవచ్చు. ఈ చాక్లెట్లలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 


స్ట్రెస్ బస్టర్
మూడ్ స్వింగ్స్‌ను తగ్గించడంలో చాక్లెట్ సహకరిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. డార్క్ చాకొలెట్ తినడం వల్ల మెదడులో ఉండే డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదలవుతుంది. మానసిక స్థితిని ఉత్తేజ పరుస్తుంది. స్విట్జర్లాండ్ శాస్తవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఆందోళన, ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులకు డార్క్ చాకోలెట్ రెండు వారాల పాటూ తినిపిస్తే పరిస్థితి మెరుగవుతుంది. 


క్యాన్సర్ రాకుండా...
చాకోలెట్ తయారీలో వాడే కోకో పొడిలో పెంటామెరిక్ ప్రోసైనిడిన్ లేదా పెంటామెర్ అని పిలిచే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల వ్యాప్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. జార్జ్ టౌన్ యూనివర్సిటీలోని లొంబార్డి క్యాన్సర్ సెంటర్ వారు నిర్వహించిన పరిశోధన ప్రకారం 2005లో పెంటామెర్‌తో క్యాన్సర్ కణాలకు చికిత్స చేసినప్పుడు అవి అణచివేతకు గురయ్యాయి. దీన్ని బట్టి క్యాన్సర్ యాంటీ ఆహారాలలో చాక్లెట్ కూడా ఒకటి అని అర్థమవుతోంది.


మెదడు ఆరోగ్యానికి...
రోజూ తినే చిన్న చాక్లెట్ ముక్క మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. నాటింగ్ హోమ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో కోకో పొడి అధికంగా ఉండే పానీయాలు, లేదా చాక్లెట్ తినడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుందని తేలింది. కోకో పొడిలో ఉండే ఫ్లేవనోల్స్ మెదడులోని కీలక భాగాలకు రెండు నుంచి 3 గంటల పాటూ రక్త ప్రసరణను పెంచుతాయి. దీనిల్ల మెదడు చురుకుగా ఉంటుంది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: కష్టానికి దక్కిన బహుమతి, తన ఉద్యోగికి బెంజ్ కారును గిఫ్టుగా ఇచ్చిన యజమాని


Also read: సముద్రపు చేపలంటే ఇష్టమా? వాటిలో దాక్కున్న అయిదు ప్రమాదాలు ఇవిగో