టాలీవుడ్ హీరోలంతా చాలా బిజీగా గడుపుతున్నారు. ఒక్కో హీరో రెండు, మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టి దూసుకుపోతున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఎవరి రేంజ్ కి తగ్గట్లు వాళ్లు సినిమాలు లైనప్ చేసుకున్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడెప్పుడో 'ప్రేమ కాదంట' సినిమాను పూర్తి చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు ఈ హీరోకి సంబంధించి కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం అల్లు శిరీష్ ముంబైలో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ లో గీతాఆర్ట్స్ కి సంబంధించిన వ్యవహారాలు శిరీష్ చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం అతడు బాలీవుడ్ లో కథలు వింటున్నారని.. త్వరలోనే అల్లు అరవింద్ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారని.. దానికి శిరీష్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారని టాక్. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.
మరోపక్క ఈ యంగ్ హీరో కొత్త వ్యాపారంలో దిగినట్లు తెలుస్తోంది. ఓ ఐటీ కంపెనీతో డీల్ పెట్టుకొని షార్ట్ వీడియో యాప్ ని డిజైన్ చేయిస్తున్నారట. త్వరలోనే దాన్ని లాంచ్ చేస్తారట. ఈ బిజినెస్ లో అల్లు శిరీష్ తన తరఫున రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ యాప్ కి సంబంధించి ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలనేదానిపై అతడు వర్క్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాల పరంగా అల్లు శిరీష్ ఎక్కడా కనిపించడం లేదు కానీ రియల్ లైఫ్ లో మాత్రం చాలా బిజీగా ఉన్నారని తెలుస్తోంది.