లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasarao) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి చెన్నైలో ఆమె కన్నుమూశారు. తన భార్య లక్ష్మీ  కల్యాణి.. శనివారం రాత్రి 9.10గంటలకు మరణించిందని.. 62 ఏళ్ల సుదీర్ఘమైన తమ భాగస్వామ్యానికి ముగింపు పడిందని సింగీతం తెలిపారు. 

 

1960లో సింగీతం శ్రీనివాసరావు.. లక్ష్మీ కల్యాణిని వివాహం చేసుకున్నారు. సింగీతం దర్శకుడిగా పని చేసిన సినిమాలకు స్క్రిప్ట్ రాయడంతో లక్ష్మీ కల్యాణి తనవంతు సాయం అందించేవారు. తన సతీమణి గురించి తెలియజేస్తూ సింగీతం.. 'శ్రీకళ్యాణీయం' అనే పుస్తకాన్ని కూడా రాశారు. వయసు రీత్యా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు సింగీతం. 

 

గతంలో ఆయన 'ఆదిత్య 369'కి సీక్వెల్ తీస్తారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ఇకపై ఆయన దర్శకుడిగా సినిమాలు చేయలేరని అంటున్నారు. ఇదిలా ఉండగా.. 'ప్రాజెక్ట్ K'(Project K) సినిమాకి మాత్రం ఆయన సాహయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రభాస్(Prabhas) నటిస్తోన్న ఈ సినిమాకి సింగీతం సలహాలు, సూచనలు అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.