ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. ఇప్పటికే రైతుల కోసం కొన్ని పథకాలు అమలులో ఉండగా ‘వైఎస్ఆర్ రైతు రథం’ అనే పేరుతో మరో సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది. ఈ రైతు రథం పథకం కింద అర్హత కలిగిన వారికి ట్రాక్టర్లను రాయితీపై పంపిణీ చేస్తారు. రైతు రథం కార్యక్రమాన్ని జూన్ 6 నుంచి మొదలుపెట్టనున్నారు. అందులో భాగంగా ప్రారంభం రోజే ఏకంగా 6 వేల ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేయనున్నారు.
ఈ పథకం కింద ట్రాక్టర్ పొందాలనుకొనే రైతులు ఈ పద్ధతిని అనుసరించాలి. ముందు సన్నకారు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. కనీసం ముగ్గురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడాలి. దానికి డ్వాక్రా గ్రూపుల తరహాలో ఏదైనా పేరు పెట్టుకోవాలి. ప్రతి రైతు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ లతో పాటు బ్యాంకు నుంచి రుణాలు కట్టాల్సినవి పెండింగ్‌లో ఏవీ లేవని నిర్ధారించుకునేందుకు నో డ్యూ సర్టిఫికెట్‌ను జత చేయాలి. ఈ పత్రాలను రైతు భరోసా కేంద్రంలో అందించాలి.
ఇది పూర్తయ్యాక పేరు పెట్టుకున్న గ్రూపుపైన ఒక బ్యాంకు అకౌంట్ తెరవాలి. జూన్ 2వ తేదీ లోగా ఈ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేస్తారో ఆ రైతులు ఈ రాయితీ ట్రాక్టర్ల కోసం అప్లై చేసుకునేందుకు అర్హులు అవుతారు. చివరికి రౌతులు రైతులు తమకు నచ్చిన ట్రాక్టర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ట్రాక్టర్‌కు సంబంధించిన వివరాలను కూడా రైతు భరోసా కేంద్రానికి తెలపాల్సి ఉంటుంది.
రైతు రథం కింద ఎంపికైన రైతు గ్రూపు యొక్క బ్యాంకు అకౌంట్‌కు ట్రాక్టర్ సబ్సిడీ మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేస్తారు. మిగతా డబ్బులు చెల్లించి రైతులు ట్రాక్టర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇలా గ్రూపులుగా ఏర్పడిన రైతులకు ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది. పురుగు మందులు పిచికారీ చేయడం కోసం డ్రోన్లను కూడా రైతులకు అందించనున్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు ఇస్తామని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. అందుకు తగినట్లుగానే రైతు రథం (YSR Rythu Ratham) పేరుతో అన్నదాతలకు ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారు. జూన్ 6న రైతులకు 6 వేల ట్రాక్టర్లను పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. రైతులు నేరుగా వాళ్ళకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చని, వాటికయ్యే నగదు సబ్సిడీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని వ్యవసాయ మంత్రి చెప్పారు. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం జగన్ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు.