ప్రతి సంవత్సరం వేసవి కాలం వచ్చిందంటే ప్రజలకు స్పెషల్ రుచుల కాలం అని చెప్పవచ్చు. సంవత్సరం పొడవునా వాడుకోవడానికి అనువుగా ఉండే రకరకాల రుచికరమైన పచ్చళ్లలో మామిడికాయదే అగ్రస్థానం. ఉదయం తినే టిఫిన్ దగ్గర నుండి రాత్రి డిన్నర్ వరకు పలురకాలుగా ఆవకాయ పచ్చడిని జనం ఆస్వాదిస్తారు. ఇక కాయలు కాసే ఎండా కాలంలోని ఏప్రిల్, మే నెలల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుని ప్రతి కుటుంబంలో పచ్చళ్లు పట్టుకుంటారు. ప్రధానంగా మహిళలు మామిడి కాయల్లో రెండు రకాలైన వెరైటీ పచ్చళ్లను తయారు చేస్తారు. అయితే, ఈ సారి పచ్చడికి కష్టకాలం వచ్చినట్టుంది. ధరల భారానికి సామాన్యులకు దూరమయ్యే పరిస్థితి తెచ్చింది.
కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా మామిడి తోటలు మానకొండూరు, కోహెడ, రామడుగు, గంగాధర, జగిత్యాల, కోరుట్ల, చిగురుమామిడిలలో ఉన్నాయి. ఇక్కడ పండే మల్లిక, నీలాలు, పెద్ద కాయ, జలాల వెరైటీలను ప్రధానంగా తొక్కు కాయలుగా వాడతారు. అయితే, ఈసారి దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్లో వేలం వేసే సమయంలో మంచి రకమైతే బస్తాకు రూ.1,500 నుండి రూ.2 వేలు పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ. రకరకాల కారణాలతో అల్లంవెల్లుల్లి, కారం, నూనె, మెంతులు, ఆవాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో సాధారణంగా ఒక కుటుంబానికి సంవత్సరాంతం ఉపయోగపడే విధంగా పెట్టే పచ్చడిని ఈసారి కేవలం పది పదిహేను కాయలతో సరిపెట్టుకొని మమ అనిపించుకుంటున్నారు.
గతంతో పోలిస్తే ముడిసరుకుల ధరలు ఇలా..
అసలు పచ్చళ్ల ధరలు ఇంత భారీ ఎత్తున పెరగడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే ముడి సరుకుల ధరలు గమనించాల్సి ఉంటుంది. గతంలో రూ.90 నుండి రూ.120 పలికిన మంచి నూనె ధర ప్రస్తుతం 195 నుండి 210 రూపాయలుగా ఉంది. స్పెషల్ గా పట్టించే గానుగ నూనె గతంలో దాదాపుగా రూ.275 ఉండగా ఇప్పుడు దాదాపు రూ.350 పైనే ఉంది. ఇక పచ్చళ్లకు వాడే స్పెషల్ కారం అయితే కిలోకి రూ.250 వరకూ గతంలో ఉండేది. ఈ సారి ఏకంగా 420 రూపాయల వరకు ఎగబాకింది. మెంతులు 100 రూపాయల నుండి 160, ఆవాలు 60 నుండి 150, వెల్లుల్లి 40 నుండి 60 రూపాయలకు పెరిగాయి. గత ఏడాది 100 రూపాయలకు చిన్న మామిడికాయలు అయితే 20 వరకూ వచ్చేవి. పెద్దవి 15 వరకు వచ్చాయి. కానీ ఈ సారి అందులో సగం మాత్రమే వస్తున్నాయి. దీంతో బెంబేలెత్తిన జనాలు గతంలో కంటే సగం క్వాంటిటీలో కూడా పచ్చళ్ళు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎంత జిహ్వచాపల్యం ఉన్నా ధరల మంటలు చూస్తే చంపుకోక తప్పదు.