ఆమె ఓ కానిస్టేబుల్‌ భార్య.. విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులను వెతికింది.. ఇంకేం రైల్వేలో గెజిటెడ్‌ ఉద్యోగిగా తనకు తాను నకిలీ పత్రాలు సృష్టించుకుంది.. సమీప బందువులను టార్గెట్‌గా చేసుకుంది.. ఆమె కానిస్టేబుల్‌ భార్య కావడంతో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు సులువుగా నమ్మేశారు.. ఎంచక్కా రూ.1.88 కోట్లు వారి వద్ద నుంచి వసూళ్లు చేశారు.. చాలా రోజుల వరకు ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాదితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం కాస్తా బయట పడి కానిస్టేబుల్‌ దంపతులు కాస్తా కటకటాలపాలయ్యారు..


ఖమ్మం జిల్లాలో ఉద్యోగాలిపిస్తామని రూ.1.88 కోట్లు వసూళ్లు చేసిన కానిస్టేబుల్‌ దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. ఇందుకు సంబంధించి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


ఖమ్మం నగరంలోని సుగ్గలవారి తోట ప్రాంతానికి చెందిన ముద్దం శ్రీశాంత, దాసరి సరిత అనే దంపతులు నివాసముంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలని ఆలోచనలో ఉన్న వీరివురు ఓ పథకం పన్నారు. ఇదే అదనుగా దాసరి సరిత తనకు తాను రైల్వేలో గెజిటెడ్‌ ఉద్యోగం చేస్తున్నానంటూ ఫేక్‌ ఐడెంటీ కార్డు సృష్టించుకుంది. ప్రెండ్స్, బందువులను టార్గెట్‌ చేసి వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించారు. శ్రీశాంత పోలీస్‌ కానిస్టేబుల్‌ కావడంతో వీళ్లు కాస్తా సులువుగానే నమ్మేశారు. ఇంకేం సుమారు 12 మంది బాధితుల నుంచి రూ.1.88 కోట్లు వసూళ్లు చేశారు.


అయితే ఉద్యోగాల కోసం డబ్బులు కట్టిన వీళ్లు ఎంతకు ఉద్యోగాలు రాకపోవడంతో తమ వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.36 లక్షల  రూపాయలు తీసుకొని మోసం చేసిందని ఖమ్మం నగరంలోని చెరువు బజారుకు చెందిన పాలవెల్లి తులసి మరియు డౌలే సునీత పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ గారిని కలసి ఫిర్యాదు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు వన్‌టౌన్‌ సీఐ దాసరి సరిత, ముద్దం శ్రీశాంతలపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. 


వసూళ్లు చేసిన సొమ్ములతో విలాసవంతమైన జీవితం..
నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేసిన డబ్బులతో ఈ కానిస్టేబుల్‌ దంపతులు విలాసవంతమైన జీవితం గడిపారని పోలీసులు తెలిపారు. స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అయితే బాదితులు ఫిర్యాదుతో వీరి అసలు రంగు బయటపడింది. వీరు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించామని, రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. కానిస్టేబుల్‌పై శాకపరంగా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ వివరించారు. నిరుద్యోగులను టార్గెట్‌ చేస్తూ వారి వద్ద నంంచి రూ.1.88 కోట్లు వసూళ్లు చేసిన సంఘటన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది.