VIP Darshan Cancel for 3 Days At Tirumala: కరోనా ఆంక్షల తర్వాత తిరుమలలో రికార్డు స్థాయిలో దర్శనాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు పరీక్షలు సైతం పూర్తి కావడం, వారాంతాలు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 89వేల మంది ఒక్కరోజే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే కరోనా ఆంక్షల తర్వాత ఇదే ఎక్కువ. మొత్తం 29కంపార్ట్మెంట్స్ భక్తులతో నిండి పోయాయి. అధికారులు శ్రీవారి దర్శనానికి 10గంటలు పడుతుంది అంటున్నారు. కానీ భక్తులు శ్రీవారిని దర్శించుకునేందకు దాదాపు 48 గంటల వరకు సమయం పడుతోంది. ఈ క్రమంలో టీటీడీ కూడా మూడు రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అయితే ఆదివారం శ్రీవారి దర్శనానికి 10 నుంచి 12 గంటలు పడుతుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.


టీటీడీ కీలక నిర్ణయం..
తిరుమలలో కంపార్ట్‌మెంట్లలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండటంతో స్వామివారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు తిరుమల ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని టీటీడీ సూచించింది. ముఖ్యంగా వీఐపీలు ప్రస్తుతానికి తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమమని టీటీడీ శనివారం కోరింది. తలానీలాలు సమర్పించడానికి గంటలు తరబడి కల్యాణ కట్ట వద్ద భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు అద్దె గదులు దొరకక సైతం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటలు సమయం పడుతున్నట్లు సమాచారం.


ఆదివారం భక్తుల రద్దీ
శ్రీవారి దర్శనార్థం భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్న భక్తుల కొరకు ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం భక్తుల అనూహ్య రద్దీ కారణంగా తిరుమలలో నెలకొన్న పరిస్థితులను మీడియాకు వివరించారు. స్వామి వారి దర్శనంతరం ఆలయం వెలుపల వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గత 10 రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందన్నారు.


 వేసవి సెలవుల కారణంగా భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని తెలిపారు. టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోందన్నారు. అధికం సమయం పడుతున్నా సరే తిరుమలకు వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. కానీ ఒకేసారి భారీ సంఖ్యలో పోటెత్తడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. సర్వదర్శనం వచ్చే భక్తుల సౌకర్యం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. అసరమైతే టైం స్లాట్ ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 


Also Read: Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం


Also Read: Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!