Eluru range DIG Pala Raju: కోనసీమ జిల్లాలో అల్లర్ల కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అమలాపురం అల్లర్లు కేసులో శనివారం మరో 25మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. రేపు (ఆదివారం) కూడా మరి కొంతమంది నిందితుల అరెస్టు ఉంటుందన్నారు. 20 వాట్సాప్ గ్రూపుల ద్వారా విధ్వంసానికి ప్లాన్ చేశారని వెల్లడించారు.
నష్టాన్ని నిందితుల నుంచే రాబడతాం
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ చెలరేగిన అమలాపురం అల్లర్లలో ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని డీఐజీ పాలరాజు చెప్పారు. అదే సమయంలో నిందితుల ఆస్తులను సీజ్ చేస్తామన్నారు. అల్లర్లు జరిగిన సమయంలో రికార్డైన వీడియోలు, సీసీటీవీ పుటేజ్, టవర్ లొకేషన్ లాంటి సాంకేతికత ఉపయోగించి నిందితులను గుర్తిస్తున్నామని, అందులో భాగంగా మరో 25 మందిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
144సెక్షన్ మరో వారం రోజులు పొడగింపు
అమలాపురంలో అల్లర్ల కేసును ఉద్దేశపూర్వక దాడులుగా పోలీసులు గుర్తించారు. దాంతో అమలాపురంలో మరో వారం రోజులపాటు 144 సెక్షన్ కొనసాగించనున్నట్లు వెల్లడించారు.
ఇంటర్నెట్ సేవలు మరో రోజు నిలిపివేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు.
అల్లర్ల సూత్రధారి అరెస్ట్
Amalapuram Riots: అమలాపురంలో మంగళవారం (మే 24) చెలరేగిన అల్లర్లకు కీలక సూత్రదారిగా భావిస్తోన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్యం సాయి పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఈ నెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనలో ఇతను కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద కూడా ఒంటిపై అన్యం సాయి పెట్రోల్ పోసుకున్నాడు. అతనిపై గతంలోనే పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లుగా తెలుస్తోంది.
అప్పుడు జనసేన, ఇప్పుడు వైసీపీ?
గతంలో జనసేన పార్టీలో ఉన్న అన్యం సాయి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరాడు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఓ అధికారి దగ్గర డ్రైవర్‌గా పని చేసే ఇతనికి నాయకులందరితో ఫోటోలు దిగే అలవాటు ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా కోనసీమ ఉద్యమం అంటూ కొద్దిరోజులుగా వాట్సాప్ గ్రూప్‌లలో అన్యం సాయి పోస్ట్‌లు పెడుతున్నట్లు తెలుస్తోంది.
రెండు నెలల క్రితం రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేక డిమాండ్ లు వస్తున్నందున తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు మారుస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై మరో వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ‘కోనసీమ ముద్దు - వేరే పేరు వద్దు’ అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.