ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకి అన్ని రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో సినిమాలో నుంచి కొన్ని సన్నివేశాలను తొలగించారు. అలా తొలగించిన సన్నివేశాలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తోంది.
తాజాగా విడుదలైన 'పుష్ప' డిలీటెడ్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పుష్పరాజ్ తల్లి.. రెడ్డప్ప అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటుంది. అది తీర్చకపోవడంతో ఊరందరి ముందు ఆమెని అవమానిస్తూ.. రెడ్డప్ప మాట్లాడతాడు. దీంతో పుష్పరాజ్ కి కోపమొస్తుంది కానీ రియాక్ట్ అవ్వకుండా.. ఆ మరుసటి రోజు ఇంట్లో ఉన్న పశువులను అమ్మేసి రెడ్డప్పకు బాకీ తీరుస్తాడు. ఆ తరువాత 'నీ లెక్క సరిపోయింది సరే.. మరి నా లెక్క' అంటూ రెడ్డప్పను కొట్టే సన్నివేశం చాలా మాసివ్ గా ఉంది.
ఈ వీడియోలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. ఈ సీన్ ఎందుకు తీసేశారో మరి. సినిమాలో ఈ సీన్ ఉండాల్సిందంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.275 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని.. టోటల్ రన్ లో రూ.325 నుంచి 350 కోట్ల గ్రాస్ 'పుష్ప' కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని నిర్మాతలు వెల్లడించారు. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 'పుష్ప ది రూల్' రాబోతుంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.