Allu Arjun's fans thrash man in street fight: ఫ్యాన్ వార్స్.. పెద్ద పెద్ద హీరోలా సినిమాల రిలీజ్ అప్పుడు ఎక్కువగా జరుగుతుంటాయి. కారణం.. అభిమానం ముదిరి, హద్దుమీరడం. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పుకోవడం వల్ల ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. నిజానికి సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ ఫ్యాన్ వార్స్ కనిపిస్తుంటాయి. కానీ, ఒక్కోసారి ఆ గొడవలు సోషల్ మీడియాని దాటిపోతాయి. మాటల యుద్ధాలు కాస్తా కొట్టుకునే వరకు వస్తాయి. తమ అభిమాన హీరోని ఏదో అన్నాడని తన్నడం లాంటి ఘటనలు ఎక్కువై పోయాయి ఈ రోజుల్లో అదే జరిగింది కర్నాటకలో కూడా. ఒక హీరో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఒక వ్యక్తిని చొక్క చినిగిపోయేలా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్ పిచ్చికి పరాకాష్ట...
బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఫ్యాన్స్ పిచ్చిక పరాకాష్టగా నిలిచింది. ఒక గ్రౌండ్ లో యువకుడిని చుట్టుముట్టిన కొంతమంది అతడిని చితకబాదారు. ఒక్కడిని చేసి చొక్కా చినిగి, రక్తం కారేలా చావబాదారు. ఆ విషయం మొత్తాన్ని వీడియో తీసి నెట్టింట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. క్రికెట్ ఆడుతుండగా గొడవ జరిగినట్లు ఆ వీడియోలో ఉన్నదృశ్యాల్లో చూస్తే తెలుస్తుంది. అతని చొక్కాపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి కేకలు వేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.
నిందితుల మాటలను బట్టి దెబ్బలు తింటున్న యువకుడు ‘జై అల్లు అర్జున్’ అనకపోవడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. అల్లు అర్జున్, అల్లు అర్జున్ అంటూ పది మంది కేకలు వేస్తూ.. వ్యక్తిని కొట్టడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. వీడియో కాస్తా వైరల్ కావడంతో ఒక వ్యక్తి దీనిని ఎక్స్‌లో షేర్ చేస్తూ వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశాడు. అయితే, దెబ్బలు తిన్న వ్యక్తి ఏ హీరో అభిమానో తెలియరాలేదు.
ఈ విషయంపై బెంగళూరు పోలీసులు స్పందించారు. కంప్లైంట్ నమోదు చేసినట్లు చెప్పారు. బాధితుడి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడామని అన్నారు. కే.ఆర్ పురం పోలీసులు దీనిపై తదుపరి విచారణ చేపడతున్నట్లు ట్వీట్ చేశారు పోలీసులు.
"హీరోలు హీరోలు బాగానే ఉంటారు. మీరు ఎందుకు రా కొట్టుకుంటారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. "అభిమానం అంటే మంచి పనులు చేయాలి కానీ, హీరోకి చెడ్డపేరు వచ్చేలా కొట్టడం కరెక్ట్ కాదు" అంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఏకంగా ఒక హీరో అభిమాని, ఇంకో హీరో అభిమానిని చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే, అభిమానం సినిమా వరకు పరిమితం అయితే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు. పుట్టినరోజుకి మంచి పనులు చేయడం లాంటివి చేస్తే పర్లేదు కానీ, ఇలాంటి గొడవలు చేస్తే దాన్ని అభిమానం అనరని ఉన్మాదం అంటారని అభిప్రాయపడుతున్నారు.
Also Read: కంగనా పాటకు సాయి పల్లవి డ్యాన్స్ - తన ఆనందానికి కారణం ఇదే!