Actress Rachna Banerjee Enters into Politics: రచన.. ఈ పేరు వినగానే తప్పకుండా మీకు అలనాటి సినిమాలు గుర్తుకొస్తాయి. చిరంజీవితో ‘బావగారు బాగున్నారా’ సినిమాతోపాటు ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అభిషేకం’, ‘ఈశ్వర్ అల్లా’, ‘సుల్తాన్’, ‘కన్యాదానం’, ‘మావిడాకులు’, ‘పిల్ల నచ్చింది’, ‘రాయుడు’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ మూవీ తర్వాత రచన మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. సుమారు 22 ఏళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. బెంగాలీ, ఒడియా సినిమాలు.. టీవీ షోస్‌లో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. ప్రముఖ బెంగాలీ టీవీ షో అయిన ‘దీదీ నెంబర్ 1’కు హోస్ట్‌గా వ్యవహరించి మంచి గుర్తింపును తెచ్చుకుంది రచన బెనర్జీ. ఇప్పుడు బుల్లితెరను వదిలేసి ఏకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్‌సీ) పార్టీ తరపున హూఘ్లీ లోక్ సభ సీటు కోసం పోటీపడుతోంది రచన.
నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా..
లోక్ సభ పోటీల్లో ఒక సీనియర్ బీజేపీ నేతతో తలపడనుంది రచన బెనర్జీ. హూఘ్లీ లోక్ సభ సీటు కోసం మాజీ నటుడు, బీజేపీ ఎంపీ అయిన లోకేత్ ఛాటర్జీతో పోటీపడనుంది. రచన బెనర్జీ ఎన్నో బెంగాలీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించడంతో పాటు ఒడియాలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నార్త్‌లో మాత్రమే కాదు.. సౌత్‌లో కూడా రచనకు నటిగా గుర్తింపు లభించింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణలాంటి స్టార్లతో సైతం జోడీకట్టింది. వెండితెరపై వెలిగిపోయిన తర్వాత మెల్లగా బుల్లితెరపై షిఫ్ట్ అయ్యింది ఈ భామ. బెంగాల్‌లోని షోలలో హోస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఉన్నట్టుండి రాజకీయాలపై ఆసక్తి చూపించడంతో ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
బ్యూటీ పోటీల్లో విన్నర్..
రచన బెనర్జీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘దీదీ నెంబర్ 1’ షో బెంగాలీలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దాదాపు దశాబ్దానికి పైగా ఈ షో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. 1974 అక్టోబర్ 2న జన్మించింది ఝుమ్‌ఝుమ్ బెనర్జీ అలియాస్ రచన బెనర్జీ. సోషల్ మీడియాలో తన పర్సనల్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకునే రచనకు ఫేస్‌బుక్‌లో 3.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 891కే ఫాలోవర్స్ ఉన్నారు. 1994లో మిస్ కోలకత్తాగా కిరీటం దక్కడంతో తన కెరీర్ మలుపు తిరిగింది. అంతే కాకుండా అదే ఏడాది మిస్ ఇండియాకు సంబంధించిన అయిదు పోటీల్లో తను విన్నర్‌గా నిలిచింది. దీంతో వెండితెర మేకర్స్ దృష్టి తనపై పడింది.
ఒకే నటుడితో వరుస సినిమాలు..
అప్పటివరకు ఝుమ్‌ఝుమ్ బెనర్జీగా కొనసాగిన తనకు.. దర్శకుడు సుఖేన్ దాస్.. రచన అని స్క్రీన్ నేమ్ ఇచ్చారు. ఒడియాలో ఒకే నటుడి సరసన తను 40 చిత్రాల్లో నటించింది. సిద్ధాంత్ మహాపాత్ర అనే ఒడియా నటుడితో తను దాదాపు 40 సినిమాలు చేసింది. దీంతో రచనకు ఒడియాలో కూడా పాపులారిటీ లభించింది. అంతే కాకుండా బాలీవుడ్‌లో కూడా తను ఒకట్రెండు గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘సూర్యవంశం’లో రచన కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. ఇక తను బుల్లితెరను వదిలేసి రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా తన హోస్ట్ చేస్తున్న ‘దీదీ నెంబర్ 1’ షోకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అతిధిగా వచ్చారు. మార్చి 3న మమతా ఎపిసోడ్ ప్రసారం అయ్యింది.
Also Read: ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఏంటో అప్పుడే నాకు తెలిసింది - నటి శ్రీదేవి