Oscars 2024 Winners List: నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే అవార్డు వచ్చిందని తెలిస్తే సంతోషిస్తారు. అందులోనూ ఆస్కార్ వస్తే మరింత ఆనందపడతారు. మళ్లీ అటువంటి సినిమా తీయాలని ఉందని, మరోసారి ఆస్కార్ అందుకోవాలని ఉందని చెబుతారు. ఉక్రెయిన్ ఫిల్మ్ మేకర్, జర్నలిస్ట్ మిస్టిస్లావ్ చెర్నోవ్ ఆస్కార్ వేదికపై తన ఆవేదన వ్యక్తం చేశారు. తన దేశ ప్రజల శాంతి కోసం ఆస్కార్ అవార్డును రష్యాకు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


ఈ ఫిల్మ్ ఎప్పుడూ చేయలేదని...
ఉక్రెయిన్ చరిత్రలో తొలి ఆస్కార్!
Best Documentary Feature Film Winner Oscar 2024: డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ ఏడాది (ఆస్కార్స్ 2024)లో '20 డేస్ ఇన్ మారియో పోల్'కు అవార్డు వచ్చింది. ఆ అవార్డు అందుకోవడానికి వేదికపైకి వచ్చిన మిస్టిస్లావ్ చెర్నోవ్ ''ఇది ఉక్రెయిన్ చరిత్రలో తొలి ఆస్కార్ అవార్డు. బహుశా... ఈ వేదికపై 'నేనెప్పుడూ ఈ సినిమా చేయలేదని అనుకుంటా' అని చెప్పే తొలి దర్శకుడిని నేనే కావచ్చు'' అని చెప్పారు. అందుకు కారణం ఏమిటంటే... ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేయడం ప్రారంభించిన తర్వాత 20 రోజుల పాటు మారియో పోల్ సిటీలో ఏం జరిగింది? అనేది '20 డేస్ ఇన్ మారియో పోల్'లో మిస్టిస్లావ్ చెర్నోవ్ చూపించారు. అటువంటి దాడులు జరగకూడదని, అసలు అటువంటి సినిమా తాను ఎప్పుడు చేయలేదని అనుకుంటానని ఆయన పేర్కొన్నారు. 


ఉక్రెయిన్ మీద ఎప్పుడూ యుద్ధం చేయనంటే...
ఆస్కార్ వేదికగా ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ మిస్టిస్లావ్ చెర్నోవ్ ఖండించారు. తన దేశంలోని వేలాది మంది ప్రజలను (ఉక్రెయిన్లను) రష్యన్లు చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చరిత్రను మార్చలేనని... కానీ జైళ్లల్లో మగ్గుతున్న సామాన్యులను, తమ భూభాగాలు కాపాడుతున్న సైనికులను, శరణార్థులను విడిచిపెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ మీద ఎప్పుడూ యుద్ధం చేయనంటే, తమ నగరాలను ఆక్రమించుకోనని చెబితే... రష్యాకు '20 డేస్ ఇన్ మారియో పోల్' డాక్యుమెంటరీకి వచ్చిన అవార్డు ఇవ్వడానికి తాను సిద్ధమని మిస్టిస్లావ్ చెర్నోవ్ ఆస్కార్ వేదికగా తెలిపారు.


Also Read: క్రిస్టోఫర్ నోలన్‌కు ఫస్ట్ ఆస్కార్, ఏడు అవార్డులతో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్' - 2024లో విజేతలు వీరే


ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇవ్వండి...
హాలీవుడ్ ప్రముఖులకు మిస్టిస్లావ్ పిలుపు!
ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా హాలీవుడ్ ప్రముఖులు తమ గళం వినిపించాలని ఆస్కార్ వేదికగా మిస్టిస్లావ్ చెర్నోవ్ పిలుపు ఇచ్చారు. నిజం నలుగురికీ తెలిసేలా చరిత్రను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.


Also Read: మళ్లీ ఆస్కార్స్ స్టేజిపై నాటు నాటు - ఇండియన్స్‌ కు మరోసారి ప్రైడ్ మూమెంట్!


''చరిత్రలో ఏం జరిగింది? అనేది కాదు, మనం ఎలా గుర్తు పెట్టుకుంటామనేది ముఖ్యం. భావి తరాలు వెనక్కి తిరిగి చూస్తే మనకు జరిగిందని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. వాళ్లు సినిమా ద్వారా చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుంటారు. అది డాక్యుమెంటరీ అయినా, ఫీచర్ ఫిల్మ్ అయినా! ఉక్రెయిన్ చిన్నారులు మరో ప్రపంచంలోకి పారిపోవాలని అనుకుంటున్నారు. బాంబు దాడుల నుంచి దాక్కుంటున్నారు. ప్రాణాల కోసం పోరాడుతున్నారు'' అని మిస్టిస్లావ్ చెర్నోవ్ ఉద్వేగభరితంగా ఆస్కార్ వేదికపై ప్రసంగించారు.


Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్స్ స్వీట్ సర్‌ ప్రైజ్ - పాటే కాదు, స్టేజిపై ఎన్టీఆర్, చరణ్ స్టంట్స్‌ కూడా!