Oscars 2024 Highlights: ఆస్కార్ చరిత్రలో 'నాటు నాటు...' పాటకు, 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. 95 ఏళ్ల అకాడమీ అవార్డుల చరిత్రలో మన దేశానికి ఆస్కార్ తీసుకు వచ్చిన తొలి భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేశాయి. ఇప్పుడు మరోసారి 'నాటు నాటు...' పాట ఆస్కార్ స్టేజి మీద సందడి చేసింది.
బెస్ట్ సాంగ్ అనౌన్స్ చేసేటప్పుడు!
Naatu Naatu song on Oscars stage again: ఆస్కార్స్ 2024లో 'బార్బీ' సినిమాలోని 'వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్' పాటకు ఆస్కార్ వచ్చింది. బిల్లీ ఐలిష్, ఫిన్నియస్ ఓ కానల్ అవార్డు అందుకున్నారు. విజేతలుగా ఆ ఇద్దరి పేర్లు అనౌన్స్ చేయడానికి ఇద్దరు అందాల భామలు వేదికపైకి వస్తున్న సమయంలో వెనుక 'నాటు నాటు...' సాంగ్ విజువల్స్ ప్లే చేశారు. పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ కనిపించింది.
ఆస్కార్ విజేతలను ప్రకటించే ముందు నామినేషన్స్ పొందిన వాళ్ళ వివరాలతో కూడిన వీడియో ప్లే చేస్తారు. ఆ తర్వాత గత ఏడాది ఆ అవార్డు అందుకున్నది ఎవరో కూడా చూపిస్తారు. ఆస్కార్స్ 2023లో 'నాటు నాటు...' పాట విజేతగా నిలిచింది కదా! అందుకు ఆ సాంగ్ విజువల్స్ చూపించారు. అదీ సంగతి! ఆస్కార్స్ 2024లో భారతీయ సినిమాలకు గానీ, డాక్యుమెంటరీలకు గానీ అవార్డులు ఏవీ రాలేదు. 'నాటు నాటు...' సాంగ్ ఆస్కార్ స్టేజి మీద కనిపించడం ఒక విధంగా చిన్న ఊరట అని చెప్పుకోవాలి.
Also Read: క్రిస్టోఫర్ నోలన్‌కు ఫస్ట్ ఆస్కార్, ఏడు అవార్డులతో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్' - 2024లో విజేతలు వీరే
'నాటు నాటు...' పాట కంటే ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అందుకున్నారు. అయితే... అది ఇండియన్ ఫిల్మ్ కాదు, ఫారిన్ ఫిల్మ్ 'స్లమ్‌డాగ్ మిలియనీర్'కు ఆయన అందుకున్నారు. 'నాటు నాటు...' తర్వాత ఇండియా నుంచి ఆస్కార్ అందుకునే పాటగా, ఆస్కార్స్ వరకు వెళ్లే సినిమాగా ఏది నిలుస్తుంది? అని యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా చేయనున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆ సినిమాకూ ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. 'ఆర్ఆర్ఆర్'కు అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రేక్షకాదరణ లభించిన నేపథ్యంలో మహేష్ సినిమా మీద విదేశీ ప్రేక్షకుల చూపు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సినిమా ఆస్కార్స్ బరిలో ఉంటుందని చెప్పడంలోనూ సందేహాలు అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తర్వాత మళ్ళీ రాజమౌళి సినిమాయే ఇండియాకు మరో ఆస్కార్ తెస్తుందా? లేదంటే ఇంకో సినిమా తీసుకు వస్తుందా? అనేది చూడాలి.