ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' ట్రైలర్ సోమవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. అందులో చిత్ర బృందానికి అల్లు అర్జున్ చేసిన విజ్ఞప్తి ప్రకృతిపై ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది. 'పుష్ప: ద రైజ్' సినిమా చిత్రీకరణ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చేసిన సంగతి తెలిసిందే. ప్లాసిక్ కప్పులు, బాటిల్స్, ప్లేట్స్ వంటివి ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని యూనిట్ సభ్యులను అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేశారు."నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్... ఏం లేదు. ఇక్కడ షూటింగ్ చేసినంత కాలం అందరూ... ఎవరి ప్లాసిక్ కప్పులు, బాటిళ్లు, పేపర్లు అన్నీ తీసుకొచ్చి డస్ట్ బిన్‌లో వేయండి. మనం ఈ ప్రాంతానికి ఎలా వచ్చామో... అలాగే నీట్‌గా బయటకు వెళ్లిపోవాలి" అని మేకింగ్ వీడియోలో అల్లు అర్జున్ చెప్పారు. ఆ తర్వాత మేకింగ్ విజువల్స్ చూపించారు.
అల్లు అర్జున్‌కు జంటగా రష్మికా మందన్నా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ధనుంజయ తదితరులు ఇతర తారాగణం. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్న చిత్రమిది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.'పుష్ప' మేకింగ్ వీడియో: