రివ్యూ: స్కైలాబ్
రేటింగ్: 2.5/5
నటీనటులు: నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి తదితరులు
ఎడిటర్: రవితేజ గిరిజాల
కెమెరా: ఆదిత్య జవ్వాది
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సహ నిర్మాత: నిత్యా మీనన్
నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు
విడుదల తేదీ: 04-12-2021
సత్యదేవ్ ఓ క్యారెక్టర్ చేశాడంటే... హీరోగా సినిమా చేశాడంటే... సమ్‌థింగ్ స్పెషల్ ఉంటుందనే పేరు వచ్చింది. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే, నిత్యా మీనన్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లిద్దరూ జంటగా కాకుండా... ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా స్కైలాబ్. రాహుల్ రామకృష్ణ మరో ప్రధాన పాత్రలో నటించారు. సినిమాలో నటించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరించారు నిత్యా మీనన్. హీరోయిన్ నిర్మాతగా మారడం, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. మరి, సినిమా ఎలా ఉంది?
కథ: గౌరీ (నిత్యా మీనన్)... ప్రతిబింబం అనే పత్రికలో విలేకరి. తండ్రికి బాలేదని ఉత్తరం వస్తే... హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లాలోని బండలింగంపల్లికి వస్తుంది. ఆనంద్ (సత్యదేవ్)... ఓ డాక్టర్. హైదరాబాద్ నుంచి అతడూ ఆ ఊరు వస్తాడు... తాతయ్య దగ్గరకు! సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ)దీ అదే ఊరు. అతడికి తాతల నుంచి వచ్చిన ఆస్తి కోర్టు కేసులో ఉంది. ఊరంతా అప్పులే. ఆనంద్, రామారావు కలిసి అందరూ వద్దని చెబుతున్నా... ఊరిలో ఎప్పుడో మూసేసిన ప్రాథమిక ఆస్పత్రిని మళ్లీ తెరుస్తారు. మూసేసిన ఆస్పత్రిని తెరవడం వల్ల ఏమైంది? గౌరీ ఊరు వచ్చిన తర్వాత ప్రతిబింబం ఆఫీసు నుంచి ఓ ఉత్తరం వస్తుంది. అందులో ఏముంది? అమెరికా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ 'స్కైలాబ్' శకలాలు భూమ్మీద పడతాయనే వార్త ఈ ముగ్గురి జీవితాల్లో ఎటువంటి ప్రభావం చూపింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: ఇది 'స్కైలాబ్' కథ కాదు... ఓ ముగ్గురి మనుషుల కథ, ఓ ఊరిలోని అమాయకపు ప్రజల కథ. 'స్కైలాబ్' అనేది ఈ సినిమాకు షుగర్ కోటెడ్ పిల్ లాంటిది. స్కైలాబ్ లోపల ఉన్నది మన మనుషుల కథే. మన మట్టి కథ. మనుషుల్లో అవకాశవాదులు, ఊహా ప్రపంచంలో బతికేవాళ్లు, ఏదో జరుగుతోందని భయపడేవాళ్లు, అమాయకులు... సినిమాలో అందరూ ఉన్నారు. వాళ్లలో వచ్చే మార్పు ఉంది. అప్పట్లో మనుషుల మధ్య వివక్షను గొడవల రూపంలో కాకుండా కొత్త కోణంలో చూపించింది. మంచి కథ ఉంది. అయితే... పువ్వులు అన్ని దండగా మారాలంటే ఓ దారం కావాలి. దండ అందంగా కనిపించాలంటే పువ్వులన్ని దూరం దూరంగా కాకుండా దగ్గరగా కనిపించాలి. ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. సన్నివేశాలు బావున్నా... కథను క్లుప్తంగా చెప్పడంలో దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఫెయిల్ అయ్యారు.
విశ్వక్ ఖండేరావు రాసుకున్న కథలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అయితే... ఫస్టాప్ లో ఎంత సేపటికీ కథ ముందుకు కదలదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు సాగింది. మధ్య మధ్యలో నిత్యా మీనన్ సీన్స్ కొన్ని నవ్వించాయి. సెకండాఫ్ లో, అదీ పతాక సన్నివేశాలు వచ్చేసరికి కథ ముందుకు కదిలింది. క్లైమాక్స్ సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి. అయితే... అప్పటి వరకూ నత్త నడకన సాగిన సినిమాను చూడటం ప్రేక్షకులకు కొంచెం కష్టమే. అంత స్లోగా ఉంది మరి. ఎడిటింగ్ తప్పిస్తే... సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రఫీకి పేరు పెట్టడానికి లేదు. కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్స్ మంచి అవుట్ పుట్ ఇచ్చాయి. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. డిఫరెంట్ రీ రికార్డింగ్ ఇచ్చారు. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి.
నిత్యా మీనన్ ఓ కథానాయికగా కాకుండా... పాత్రగా మాత్రమే కనిపించారు. సన్నివేశాలకు అనుగుణంగా ఆమె నటించిన తీరు బావుంది. వాయిస్ కూడా ప్లస్ అయింది. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ నటులుగా ఎప్పుడో నిరూపించుకున్నారు. వాళ్లకు పెద్దగా సవాల్ విసిరే పాత్రలు కాకపోవడంతో సులభంగా చేసుకుంటూ వెళ్లారు. తనికెళ్ల భరణి, తులసి అనుభవం వాళ్లు పోషించిన పాత్రల్లో కనిపించింది. మిగతా పాత్రధారులు పర్వాలేదు. నిత్యా మీనన్ ఇంట్లో పనిచేసే కుర్రాడు బాగా నటించారు.
'చూసే కళ్లు, రాసే ఓపిక ఉండాలి కానీ ఊరి నిండా కథలు ఉన్నాయి' అని సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. అయితే... ఆ కథలను ఆకట్టుకునేలా తెరపైకి తీసుకురావడం కూడా ముఖ్యమే. లేదంటే... మంచి ప్రయత్నంగా మాత్రమే సినిమా మిగులుతుంది. బహుశా... రెగ్యులర్ హీరో హీరోయిన్ కథ కాకపోవడం వలన నిత్యా మీనన్ కు నచ్చి సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యి ఉండొచ్చు. న్యూ ఏజ్ ఫిల్మ్ చూడాలని కోరుకునే ప్రేక్షకులు, కొంచెం కొత్తగా ఉంటే చాలు అనుకునే వాళ్లు... 'స్కై లాబ్'పై ఓ లుక్ వేయవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి... ఆకాశమంత తాపీగా సాగుతుందీ సినిమా.