సిరివెన్నెల హఠాన్మరణం సినీలోకాన్నే కాదు, తెలుగు ప్రజలను కూడా కలచి వేసింది. గొప్ప పాటల రచయితను కోల్పోయిన టాలీవుడ్ దిగ్భ్రంతికి గురైంది. సిరివెన్నెలకు, ఆయన రాతలకు సాధారణ ప్రజలే కాదు, ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం అభిమానులే. వారిలో ఒకరు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఈ వివాదాస్పద దర్శకుడు తొలిసారి ఎమోషనల్ పోస్టుతో మన ముందుకొచ్చారు.  సిరివెన్నెల మరణించిన వార్త విన్న వెంటనే ‘నేనూ వస్తా... నువ్వు స్వర్గానికే వెళ్లుంటావ్’ అంటూ బాధపడిన వర్మ, తాజాగా మళ్లీ స్పందించారు. ట్విట్టర్లో ‘అతనికి నా ముద్దు’ అంటూ ఓ పోస్టు పెట్టారు. ఆ తరువత యూట్యూబ్లో ఓ వీడియోను వదిలారు. 


స్పూర్తిని నింపే పాట
‘జీవితాన్ని మార్చేలా, స్పూర్తి నింపేలా సిరివెన్నెల రాసిన పాట ఇది, ఆ పాట రాసినందుకు ఆయనకు నా ముద్దు’ అంటూ మరో ట్వీట్ చేసి, యూట్యూబ్ లింక్ షేర్ చేశారు. ఆ వీడియోలో సీతారామ శాస్త్రి రాసిన ఓ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక మనిషి నిరాశలో ఉన్నప్పుడు అతనిలో ఆశను రేపే పాట ఇది అంటూ ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి’ అనే పాటను పాడి వినిపించారు. ఆ పాటను దాదాపు అంతా పాడారు. సిరివెన్నెల చక్కటి పాటలు రాయడానికి కారణం ఆయనకు సమాజంపై ఉన్న అవగాహనేనని అభిప్రాయపడ్డారు.చివరిలో థ్యాంక్యూ శాస్త్రిగారు అని చెప్పి వీడియోను ముగించారు. 


నిజమే ఆ పాట వింటే చావుకు సిద్ధమైనవాడు కూడా విజయం కోసం పరుగు మొదలుపెడతాడు. ఆ పాట 1992లో విడుదలైన పట్టుదల అనే సినిమాలోనిది. దీనికి ఇళయరాజా సంగీతం అందించారు.