'అల్లరి' నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilli Prajaneekam Movie). ఏఆర్‌ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఆనంది (Anandhi) కథానాయికగా నటించారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా కూడా చేరింది. ఈ రోజు సినిమా విడుదల తేదీ వెల్లడించారు.


Itlu Maredumilli Prajaneekam Release date : ఈ నెలాఖరున... నవంబర్ 25న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ''కొత్త జీవో విడుదల అయ్యింది. మీ సమీపంలోని థియేటర్లలో నవంబర్ 25న ఎన్నికలు నిర్వహించబడతాయి'' అని 'అల్లరి' నరేష్ ట్వీట్ చేశారు. 






ఎన్నికల నేపథ్యంలో ''ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రాన్ని రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి' నరేష్ నటించారు. 'నాంది' తరహాలో ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర ఇంటెన్స్ గా ఉంటుందని తెలిసింది. ఈ సినిమాలో చూపించే కథాంశం కూడా ప్రేక్షకులలో ఆలోచన కలిగిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. 


ఆల్రెడీ విడుదలైన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీజర్, పాటకు మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. టీజర్ విషయానికి వస్తే... 'సాయం చేస్తే మనిషి. దాడి చేస్తే మృగం... మేం మనుషులమే సారూ! మీరు మనుషులు అయితే సాయం చేయండి' అని ఆనంది ఆవేదనతో చెబుతున్న మాట వింటుంటే... గిరిజన గ్రామాలపై ఎవరో దాడి చేస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రసవ వేదన పడుతున్న మహిళను మంచం మీద తీసుకువెళడం చూస్తుంటే... ఇప్పటికీ వార్తల్లో కనిపించే అటువంటి దృశ్యాలు, కొన్ని గ్రామాల్లో పరిస్థితి గుర్తుకు రాక మానదు. 'మాకు జరగాల్సిన న్యాయం జరగకపోతే ఎవరినీ వదలం' అని గిరిజన గ్రామంలో యువకుడు ఆగ్రహం వ్యక్తం చేయడం... అటు గిరిజన గ్రామాల్లో ప్రజలు, పోలీసులు హీరోను కొట్టడం సినిమాపై ఆసక్తి కలిగించాయి. నరేష్ 59వ చిత్రమిది.


Also Read : రజనీకాంత్ 'లాల్ సలామ్' - అమ్మాయి దర్శకత్వంలో...


'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌', 'రిప‌బ్లిక్‌', 'బంగార్రాజు' వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాల తర్వాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో వస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి రాజేష్ దండు నిర్మాత‌. బాలాజీ గుత్త స‌హ నిర్మాత‌. 'వెన్నెల' కిషోర్‌, ప్ర‌వీణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి మాట‌లు: అబ్బూరి ర‌వి, సంగీతం: శ్రీ చ‌ర‌ణ్ పాకాల. 


సమంత 'యశోద' మినహాయిస్తే... నవంబర్ నెల అంతా మీడియం, స్మాల్ రేంజ్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. లాస్ట్ ఫ్రైడే సుమారు పది సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఎన్ని విజయాలు సాధించాయి? అనేది పక్కన పెడితే... ఈ నెల మూడు, నాలుగు వారాల్లో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.