'సోగ్గాడే చిన్ని నాయనా'... నాగార్జున కెరీర్‌లో మాంచి కమర్షియల్ హిట్. అందులో బంగార్రాజుగా ఆయన అదరగొట్టారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'బంగార్రాజు' సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడీ సీక్వెల్‌లో చిన్న బంగార్రాజుగా నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా కనిపించనున్నారు. ఈ సినిమా గురించి, నాగచైతన్య, ఏయన్నార్ గురించి నాగార్జున మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ... 

 

'సోగ్గాడే చిన్ని నాయనా'లో మీరు ఒక్కరే. 'బంగార్రాజు'లో మీతో పాటు చిన్న బంగార్రాజు (నాగచైతన్య) కూడా ఉన్నారు. ఎలా అలరించబోతున్నారు?

ఆ సినిమాకు, ఈ సినిమాకు మార్పు ఏంటంటే... చిన బంగార్రాజు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో యూత్, ఎనర్జీ మిస్ అయ్యాం. నాగచైతన్య రావడంతో అదీ యాడ్ అయ్యింది. 'సోగ్గాడు...' బాగా ఆడటంతో దానికంటే బాగా తీయాలనే బాధ్యత మా మీద ఉంది. సినిమాలో చైతన్య ఉండటంతో తండ్రిగా, నిర్మాతగా నా బాధ్యత మరింత పెరిగింది. వీటన్నిటి కంటే సంక్రాంతికి పండగ లాంటి సినిమా అని చెబుతున్నాం. అదీ పెద్ద బాధ్యత. 

 

నాగచైతన్య అయితే కాంబినేషన్ బావుంటుందని తీసుకున్నారా? లేదంటే... ఆయన ఎంపిక వెనుక ఆలోచన ఏంటి?

'సోగ్గాడే చిన్ని నాయనా'లో కుమారుడికి సమస్య ఉంటే... అతడిని కాపాడుకోవడం కోసం బంగార్రాజు కిందకు వచ్చాడు. మళ్లీ అతను కిందకు రావాలి అంటే... ఏం చేయాలని ఆలోచించాం. అప్పుడు మనవడికి సమస్య అంశాన్ని తీసుకున్నాం. నాగచైతన్య అయితే... కెమిస్ట్రీ బావుంటుంది. తెలుగు సినిమాల్లో తండ్రీ కుమారులు అంటే ఓ కెమిస్ట్రీ ఉంటుంది. వర్కవుట్ అవుతుంది. అది కమర్షియల్ ఫార్ములా. నాగచైతన్య చేస్తే బావుంటుందని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అన్నారు. 'ముందు కథ తీసుకుని రా' అని చెప్పాను. ఏడాదిన్నర కథపై వర్క్ చేశారు. స్టార్ట్ చేద్దామని అనే సరికి కొవిడ్ వచ్చింది.

 

సినిమాలో మీరు, మీ అబ్బాయి నటించారు. షూటింగ్ చేసేటప్పుడు మీ నాన్నగారు గుర్తొచ్చారా?

పంచె కడితే ఎప్పుడూ గుర్తు వస్తారు. బ్లడ్ రిలేషన్ గురించి మాట్లాడితే... 'మనం' సినిమాను వేరే ఆర్టిస్టులతో తీస్తే వర్కవుట్ అయ్యేది కాదు. నాన్నగారు, నేను, చైతన్య... ముగ్గురిలో ఎవరు లేకపోయినా అంత బాగా కుదిరేది కాదు. ఆ సినిమా హిందీలో చాలా మందికి నచ్చింది. అక్కడ తీద్దామని అనుకున్నారు. 'మనం' గురించి నాతో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. విక్రమ్ కూడా తీద్దామని ట్రై చేశారు.  తర్వాత మా కాంబినేషన్ వల్లే వర్కవుట్ అయ్యిందని డిసైడ్ అయ్యి మానేశారు. 'బంగార్రాజు' కూడా అంతే! మా కాంబినేషన్ వల్ల వర్కవుట్ అయ్యింది.

 

బంగార్రాజు పాత్ర కోసం నాగచైతన్యకు మీరు ఎటువంటి సలహాలు ఇచ్చారు?

సలహాల కంటే 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా చూడమని చెప్పాను. నాలుగైదు సార్లు చూశాడు. జూనియర్ బంగార్రాజులోకి సీనియర్ బంగార్రాజు ఎంటర్ అయిన తర్వాత వచ్చే సన్నివేశాల కోసం కొన్ని డైలాగులు రికార్డ్ చేసి ఇచ్చాను. నాకన్నా గోదావరి యాస మీద కల్యాణ్ కృష్ణకు పట్టు ఎక్కువ ఉంది. తను కూడా చైతన్యతో బాగా చేయించుకున్నాడు. నాగచైతన్య చాలా కష్టపడి బాగా చేశాడు. అతడిని చూసి స‌ర్‌ప్రైజ్ అవుతారు. ఈ పాత్రకు సూటవుతానా? లేదా? అని చైతూ డౌట్ పడితే నన్ను నమ్మమని చెప్పాను. నా మీద అదొక భారం పడింది. సినిమా చూశాక... చైతూ ఇంత మాస్ కమర్షియల్ చేయగలడా? అని ఆడియన్స్ స‌ర్‌ప్రైజ్ అవుతారు. స్క్రీన్ టైమ్ కూడా తనది ఎక్కువ సేపు ఉంటుంది.  

 

ఈ సినిమాలో చైత‌న్య రొమాంటిక్‌గా క‌నిపించారు. అందుకు కార‌ణం మీరా? క‌ల్యాణ్ కృష్ణా? బంగార్రాజు క్యారెక్ట‌రా?

బంగార్రాజు క్యారెక్టర్. బంగార్రాజుకు సరసం అంటే ఇష్టం. తాత మనవడికి ఎక్కువ పోలికలు ఉంటాయని అంటారు కదా!- ఈ పాయింట్ పట్టుకున్నాం. 

 

డిస్కషన్ వచ్చింది కాబట్టి... మీరు రొమాంటిక్క? ఏయన్నారా?

కాలాన్ని బట్టి! ఏ కాలానికి తగ్గట్టు వాళ్లు! 

 

ట్రెండీ పాత్రలను ఎంత బాగా చేస్తారో... పల్లెటూరి పాత్రల్లో కూడా అంత బాగా ఒదిగిపోతారు. ఆ కనెక్షన్ గురించి... 

చిన్నప్పటి నుంచి నాన్నగారితో వచ్చింది. 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం', 'అల్లరి అల్లుడు' గానీ... పల్లెటూరి పాత్ర అంటే కంప్లీట్ ఓపెన్ అవ్వొచ్చు. ఆ పాత్రల్లో చిన్న పొగరుబోతు తనం, సరదా ఉంటాయి.

 

రమ్యకృష్ణతో మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్!

గోల్డెన్ కాంబినేషన్. బంగారం లాంటిది. ఒకరికి ఒకరు బాగా తెలుసు కాబట్టి మా మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. రమ్యతో పనిచేసినప్పుడు నవ్వుతూ ఉంటుంది. నవ్విస్తూ ఉంటుంది.

 

మీ కెరీర్‌లో తొలిసారి పండక్కి సినిమాను విడుదల చేయాలని పట్టుబట్టి చేసినట్టు ఉన్నారు?

అవునండీ! చాలా పట్టుబట్టి చేశాం. ఇది సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయాలని సినిమా ప్రారంభించిన రోజున నిర్ణయించుకున్నాం. ఆగస్టు 25న సినిమా స్టార్ట్ చేశాం. అప్పుడే పండక్కి వస్తున్నామని టీమ్ అందరినీ కూర్చోబెట్టి చెప్పాను. ఈ పండక్కి వచ్చే అవకాశం లేదంటే... సినిమా ఆపేసి, వచ్చే పండక్కి వద్దామని, నెక్స్ట్ ఇయర్ సినిమా చేద్దామని అన్నాను. టీమ్ అందరూ 'మీ వెనుక మేం ఉన్నాం' అని క్వాలిటీలో ఏమాత్రం తగ్గకుండా చేశారు.

 

దర్శకుడు కల్యాణ్ కృష్ణ గురించి... 

వెరీ కంఫ‌ర్ట‌బుల్‌ డైరెక్టర్. తనతో పని చేయడం నాకు ఇష్టం. ఒకవేళ ఏదైనా బాలేదని చెబితే... మళ్లీ చేసుకుని వస్తాడు. 'సోగ్గాడే చిన్న నాయనా' తర్వాత తనకు ఈ క్యారెక్టర్ల మీద బాగా పట్టు వచ్చింది. డైలాగులు, సన్నివేశాలు అద్భుతంగా రాస్తాడు. ఈ సినిమాలో ఓ పాట కూడా రాశాడు. అది ట్రెండ్ అవుతోంది. 

 

పాట కూడా పాడారు. ఆ అనుభవం గురించి...
(నవ్వుతూ...) అది పద్యాలు చదివినట్టే! పాటలో బిగినింగ్ వర్డ్స్ చెబుదామని వెళ్లాను. డబ్బింగ్ చెప్పినట్టే ఉంటుందని అనుకున్నాను. అక్కడ కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్.. 'ఒకసారి ట్రై చేయండి. బావుంటుంది' అన్నారు. వాళ్లిద్దరూ ముందే కుట్ర పన్నారు. ఆ తర్వాత పదిమందికి వినిపిస్తే... బావుందన్నారు. పాడటం నాకు అలవాటు లేదు.


Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ
Also Read: ఏపీలో టికెట్ రేట్స్‌తో మాకు స‌మ‌స్య‌ లేదని ఎందుకు అన్నానంటే.. నాగార్జున వివరణ!
Also Read: పవన్ కల్యాణ్‌తో వ‌న్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!
Also Read: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి