నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్' శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సందర్భంగా నానితో ఇంటర్వ్యూ...
గ్యాప్ (రెండేళ్ల) తర్వాత థియేటర్లలోకి వస్తున్నారు!
అవును... చాలా గ్యాప్ తర్వాత! వ్యక్తిగతంగా థియేటర్లలో సినిమా చూడటం నాకు చాలా ఇష్టం. ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూలలో సత్యం థియేటర్, అక్కడి జ్ఞాపకాల గురించి మాట్లాడేవాడిని. అనుకోకుండా బ్రేక్ వచ్చింది. థియేటర్స్ లేవు... ఇంకొక ఆప్షన్ లేదు... ఎలాగోలా చేసిన సినిమాలను ఆడియన్స్ దగ్గరకు తీసుకు వెళ్ళాలి. అప్పుడు ఉన్న ఆప్షన్ ప్రకారం అలా వెళ్లాను. మళ్లీ రెండేళ్ల తర్వాత నాకు ఇష్టమైన విధంగా థియేటర్లో వెనుక నిలబడి సినిమా చూడాలని, ఆ ఎక్స్ పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. పది రోజుల నుంచి నిద్రలు కూడా లేవు.
తొలిసారి కాలంలో వెనక్కి వెళ్లారు. పీరియాడిక్ మూవీ చేశారు. ఎలా ఉంది?
ఇటువంటి సినిమాలు చేయాలంటే... కథలో చాలా దమ్ము ఉండాలి. ఎందుకంటే... బడ్జెట్ పరంగా, ఇతర అంశాల పరంగా అందరికీ రిస్క్. బ్రహ్మాండమైన కథ దొరికినప్పుడు మాత్రమే ఇటువంటి పనులు చేయగలం. 'శ్యామ్ సింగ రాయ్'కు మంచి కథ దొరికింది. ఆ కాలాన్ని తెరమీదకు తీసుకు రావాలంటే కథ, హీరో ఉంటె సరిపోదు. మంచి టెక్నీషియన్లు కావాలి. కాస్ట్యూమ్ డిజైనర్, కెమెరామెన్ ఉండాలి. ఈ సినిమాకు అన్ని శాఖల నుంచి 200 శాతం మద్దతు లభించింది. 'శ్యామ్ సింగ రాయ్' చూసేటప్పుడు... సెట్స్ వేశారు, పీరియడ్ సినిమా చూస్తున్నామన్నట్టు ఉండదు. మీరు ఆ కాలంలో ఉంటే, ఆ ప్రపంచంలోకి మీరు వెళితే ఎలా ఉంటుందో... అలా ఉంటుంది.
ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చేటపుడు ఎలా ఉంది?
సినిమా అయిపోయిన తర్వాతే బయటకు వచ్చాం. బోలెడన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఫైనల్ సినిమా చూస్తే... అన్నీ గుర్తొచ్చాయి.
మీ 'శ్యామ్ సింగ రాయ్' గెటప్ చూస్తే... 'నాయకుడు'లో కమల్ హాసన్ గెటప్, ఆయన చేసే పోరాటంలా అనిపిస్తోంది. మీరేమంటారు?
'నాయకుడు' వేరే కథ. శ్యామ్ కథ వేరు. మనం ఎక్కడో కమల్ గారి ఫ్యాన్ కాబట్టి... లుక్, మీసం, షర్టు మడత పెట్టడంలో ఆ రిఫరెన్స్ వచ్చి ఉంటుంది. 'హే రామ్'లో కమల్ మీసం అలాగే ఉంటుంది. పాత 'సత్య' సినిమా చూస్తే... షర్టు అదే విధంగా మడత పెడతారు. కథ పరంగా చూస్తే... అసలు సంబంధం ఉండదు.
శ్యామ్ పాత్ర కోసం బరువు పెరిగారా?
లేదండీ! అది బాడీ లాంగ్వేజ్ ద్వారా వచ్చేస్తుంది. చాలామంది 'శ్యామ్ కోసం మీరు వెయిట్ పెరిగారు. భలే ఉంది' అన్నారు. నేను మధ్యాహ్నం వాసు రోల్ షూటింగ్ పూర్తి చేసి, సాయంత్రం శ్యామ్ రోల్ షూటింగ్ స్టార్ట్ చేశా. సో... బరువు పెరిగే టైమ్ దొరకలేదు. నేను వేరే సినిమా షూటింగులో ఉన్నప్పుడు కథ ఓకే చేశా. అది పూర్తి చేసి రావడానికి నాలుగైదు నెలలు పట్టింది. ఈలోపు దర్శకుడు రాహుల్ అండ్ టీమ్ పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చారు. నేను వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశా.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నాని, ఇందులో దర్శకుడిగా చేశారు. ఎలా అనిపించింది?
చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. పాత రోజులు గుర్తు వచ్చాయి. అయితే... వాసుది చాలా కంఫర్టబుల్ లైఫ్. మాది అంత కంఫర్టబుల్ లైఫ్ కాదు. ఒరిజినల్ స్ట్రగుల్స్ వేరే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఆల్రెడీ చూపించారు కాబట్టి అటువంటివి మళ్లీ చూపించాలని అనుకోలేదు. వినోదాత్మకంగా చూపించాం.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ గురించి...
తను చాలా డేడికేటెడ్. ఇంకొకటి... ఆ వయసులో అలాంటి మెచ్యూరిటీ అరుదుగా చూస్తాం. చిన్న చిన్న అంశాలకు ఎగ్జైట్ అవుతారు. పెద్దగా ఎక్స్‌ప్రెస్ చేయడు. సెటిల్డ్‌గా ఉంటాడు. నేను గౌతమ్ (జెర్సీ) దర్శకుడిలో ఇటువంటి క్వాలిటీ చూశా. రాహుల్‌కు లిటరేచర్ మీద మంచి గ్రిప్ ఉంది.
ప్రచార చిత్రాల్లో మీరు బెంగాలీ డైలాగులు చెప్పారు. దాని కోసం ఎలాంటి వర్క్ చేశారు?
మేం అభ్రుజీత్ అని ఓ బెంగాలీ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. అతనితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. మనం పలికే విధానం వేరు, బెంగాలీలు పలికే విధానం వేరు. మనం 'శ్యామ్ సింగ రాయ్' అంటే... వాళ్లది వేరుగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం.
శ్యామ్ పోరాటం ప్రేమ కోసమా? దేవదాసి వ్యవస్థ మీదా?
చెడు మీద శ్యామ్ పోరాటం చేశాడు. చెడు రకరకాలుగా ఉండొచ్చు. దేవదాసి వ్యవస్థ అనేది ఒక అంశమే. ఇదేదో స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించినది కాదు. ఇది 1960లలో జరిగే కథ. అప్పటికి దురాచారాలు, మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉండేవి. శ్యామ్ కమ్యూనిస్ట్. ఎదురు తిరగడం అతనిలో ఉంది. అటువంటి శ్యామ్ ప్రేమలో పడితే... అదే సినిమా. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి ప్రేమకథ చూసి బయటకు వచ్చామని ప్రేక్షకులు ఫీలవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఇదొక ఎపిక్ లవ్ స్టోరీ. పూర్తిగా ఫిక్షనల్ క్యారెక్టర్ ఇది. చాలా మంది బెంగాలీలు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ అవుతోంది. బడ్జెట్ ఎక్కువ అయ్యింది. మీ మీద ప్రెజర్ (ఒత్తిడి) ఉందా?
ఎంత ప్రెజర్ ఉన్నా... సినిమా ఎంత బాగా వచ్చిందో నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ డే మార్నింగ్ షో తర్వాత సినిమా చూసుకుంటుందనే నమ్మకం, ధైర్యం మా టీమ్ అందరిలో ఉంది.
మీ లాస్ట్ రెండు సినిమాలు ఓటీటీల్లో చూసి... ఇవి థియేటర్ కంటే ఓటీటీలో బెస్ట్ అని కొంతమంది అన్నారు!
అలా ఎలా అంటారు!? చాలా సినిమాలను ఓటీటీలో చూసి... 'ఇది థియేటర్లో బ్లాక్ బస్టర్ అంట కదా! ఎలా ఆడిందో నాకు అసలు అర్థం కావడం లేదు' అని అన్నవాళ్లు ఉన్నారు. థియేటర్లలో అవి బ్లాక్ బస్టర్ అయ్యేవేమో! 'వి', 'టక్ జగదీష్' నిర్మాతలు చాలా హ్యాపీ. అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఇచ్చేశారు. అమెజాన్ వాళ్లు సబ్‌స్క్రైబర్లు పెరిగారని నాతో కేక్స్ కట్ చేశారు. నెక్స్ట్ సినిమాకు ఇంకా ఎక్కువ ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు 'ఎంసీఏ'కి 'టక్ జగదీష్'కు వచ్చిన రివ్యూస్, రేటింగ్ కంటే తక్కువ వచ్చాయి. కానీ, నా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది. 'టక్ జగదీష్'కు అలా చూపించడానికి ఏమీ లేదు. అమెజాన్ వాళ్లు ఎంతమంది సబ్‌స్క్రైబర్లు పెరిగారనేది చెప్పరు. సో... ఓటీటీలకు వెళ్లిన సినిమా విజయం కొలవడానికి మీటర్ లేదు. నిర్మాతలు హ్యాపీగా ఉండాలని ఓటీటీకి ఇవ్వడానికి ఓకే చేశా. థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు. నేను రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నాను.
'అంటే సుందరానికి' సినిమా ఎంతవరకూ వచ్చింది?
షూటింగ్ చివరకు వచ్చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తాం. దక్షిణాది భాషల్లో విడుదల చేస్తాం. 'దసరా' కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... నాలుగు భాషల్లో విడుదల అవుతుంది. అది రా అండ్ రస్టిక్ సినిమా. తెలుగులో ఇప్పటి వరకూ టచ్ చేయని జానర్. ఇప్పటి వరకూ తెలంగాణాలో కూడా మాట్లాడనంత తెలంగాణ అందులో ఉంటుంది.
హిందీ ఎంట్రీ ఎప్పుడు?
మన కథలు, మన సెటప్ సూట్ అవుతుందని అనుకున్నప్పుడు హిందీ సినిమా చేస్తా. హిందీలోనూ బానే ఉంటుందన్నట్టు కాకుండా.... హిందీలో బావుంటుందీ కథ అనుకున్నప్పుడు హిందీ సినిమా చేస్తా. నిజం చెప్పాలంటే... నేను పాన్ ఇండియా సినిమా చేయాల్సి వస్తే 'జెర్సీ' చేయాలి. నేను చేయకపోవడం వల్లే షాహిద్ కపూర్ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ వాళ్లకూ అవకాశాలు ఇవ్వాలి.
తమిళనాడు, కేరళలో రెస్పాన్స్ ఎలా ఉంది?
'ఈగ' సినిమా నుంచి వాళ్లు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అందులో కనిపించినది అరగంటే అయినా... నన్ను ఓన్ చేసుకున్నారు. మన దగ్గర కంటే అక్కడ ఎయిర్ పోర్ట్స్‌లో నాతో ఎక్కువ మంది ఫొటోలు దిగుతారు.
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
Also Read: ట్రేడ్... మీడియాకు చురకలు అంటించిన సిద్ధార్థ్!
Also Read: శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
Also Read: అదీ ప్రభాస్ రేంజ్... 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు యంగ్ హీరో & హాట్ బ్యూటీ రష్మీ యాంకరింగ్!
Also Read: సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి