తండ్రి నాగార్జునతో కలిసి 'మనం' సినిమాలో నాగచైతన్య నటించారు. అది క్లాస్ సినిమా. ఇప్పుడు మాస్ ఎంటర్‌టైనర్ 'బంగార్రాజు' చేశారు. సూపర్ డూపర్ హిట్ 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్ ఇది. సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా ప్రింట్, వెబ్ మీడియాతో అక్కినేని నాగచైతన్య ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
'మనం' తర్వాత మీ ఫాదర్ నాగార్జునతో నటించిన సినిమా 'బంగార్రాజు'. అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా?
చాలా ఉన్నాయి. 'మనం' చేసేటప్పుడు కొంచెం భయం ఉంది. నాన్నతో, తాతయ్య గారితో చేసేటప్పుడు... కెమెరా ముందు ఉండగా... యాక్షన్ చెప్పినా నాకు నాన్నే కనిపించేవారు. ఆ సినిమా అనుభవంతో భయం కొంచెం పోయింది. 'బంగార్రాజు'లో చాలా ఓపెన్ అయ్యి చేశా. ఇందులో ఎనర్జీతో చేశా.
'సోగ్గాడే చిన్ని నాయనా' అంటే నాగార్జున కళ్ల ముందు మెదులుతారు. మీరు క్యారెక్టర్ చేయాలని అన్నప్పుడు మీకు ఏమనిపించింది? భయపడ్డారా?
చాలా! షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నాన్నను, దర్శకుడు కల్యాణ్ కృష్ణను బోలెడు డౌట్స్ అడిగాను. మీరు అన్నట్టు 'సోగ్గాడే చిన్ని నాయనా'తో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ నేను తొలిసారి ఓ సీక్వెల్ చేస్తున్నాను. 'సోగ్గాడు...' సినిమాను ఎక్కువసార్లు చూడటం వల్ల కొంత హెల్ప్ అయ్యింది. అలాగే, నాన్నతో పాటు కల్యాణ్ కూడా చాలా హెల్ప్ చేశారు. కొన్ని సన్నివేశాలను ముందే రికార్డ్ చేసి ఇవ్వమని నాన్నను అడిగా. ఆయన అయితే ఆ సన్నివేశంలో ఎలా చెబుతారనేది రికార్డ్ చేసుకుని... ఆ యాస అవి విని చేశా. రెండు నెలలు హోమ్ వర్క్ చేసి స్టార్ట్ చేశాం.
బంగార్రాజు క్యారెక్టర్ కోసం మీ తాతయ్యగారి పంచె, వాచ్ వాడినట్టు నాగార్జున గతంలో చెప్పారు. మీరు అలా ఏమైనా తాతయ్యగారి వస్తువులు ఉపయోగించారా?
సేమ్... నాన్నగారు ఏవైతే ఉపయోగించారో? నేనూ అవి ఉపయోగించా. ఈ క్యారెక్టర్ ఒక టఫ్ క్యారెక్టర్.
ట్రైలర్ చూస్తే... మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది!
అలా కట్ చేశారు. సినిమాలో మా క్యారెక్టర్స్ సమానంగా ఉంటాయి. నాన్నది అతిథి పాత్ర కాదు. సినిమాకు బంగార్రాజే మెయిన్. ఈ సినిమాలో చిన్న బంగార్రాజు యాడ్ అయ్యి కొత్త కాన్‌ఫ్లిక్ట్ పుడుతుంది. కథంతా నాన్న, రమ్యగారు నడిపిస్తారు. నాది బంగార్రాజు మనవడి పాత్ర. ఆయన కంటే ఎక్కువ అల్లరి చేస్తుంటాను. నన్ను కంట్రోల్ చేయడానికి నాన్న (బంగార్రాజు) మళ్లీ కిందకు వస్తారు. బంగార్రాజు కుమారుడు రాము (సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో మరో నాగార్జున) అమెరికాలో ఉంటారు. ఫోనులో మాట్లాడుతున్నట్టు చూపించాం. రాము పాత్రకు, నా పాత్రకు మధ్య సీన్స్ ఎక్కువ ఉండవు.
సినిమాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. స్క్రిప్ట్ పరంగా అలా వెళ్లారా?
రమ్యకృష్ణగారు, కృతి శెట్టి మెయిన్ హీరోయిన్లు. మిగతా హీరోయిన్లు కేవలం సాంగ్స్ వరకూ మాత్రమే ఉన్నారు. నాకు జోడీగా కృతి శెట్టి కనిపిస్తారు. సాంగ్స్ ఫెస్టివల్ మోడ్‌లో ఉంటాయి. అందుకు తగ్గట్టు హీరోయిన్లను తీసుకున్నాం. పండక్కి వచ్చే సినిమా అంటే లాజిక్కులు అన్నీ పక్కన పెట్టేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలి. అదే మెయిన్.
మీకు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఈ సినిమాతో రొమాంటిక్ ఇమేజ్ వస్తుందా?
ఇది వేరే టైప్! నేను చేసిన రొమాంటిక్ సినిమాలు అన్నీ రియలిస్టిక్‌గా వెళతాయి. ఈ సినిమాకు వస్తే రొమాన్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ అయ్యి ఉంది. నాకు, నాగలక్ష్మి క్యారెక్టర్‌కు మధ్య ఎప్పుడూ ఒక వార్ జరుగుతుంది. నేను ఎంత అల్లరి చేస్తానో... కృతి శెట్టి రోల్ కూడా అంతే అల్లరి చేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అది నిజాయతీ గల ప్రేమకథగా మారుతుంది. ప్రేమకథలో రెండు షేడ్స్ ఉంటాయి. ప్రతి పది నిమిషాలకు ఏదో ఒక తమాషా ఉంటుంది.
మీకు ఇదే తొలి సంక్రాంతి రిలీజ్. నెర్వస్‌గా ఉందా?
చాలా నెర్వస్‌గా ఉంది. ఈ సినిమాను సంక్రాంతి కోసమే డిజైన్ చేశాం. 'ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయను. పండక్కి విడుదల చేయాల్సిన సినిమా' అని నాన్న మొదటి నుంచి చెబుతున్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తుండటంతో హ్యాపీగా, ఎగ్జైటెడ్ గా ఉన్నాను.
సంక్రాంతి రిలీజ్ అని టార్గెట్ పెట్టుకోవడం వల్ల హడావిడిగా షూటింగ్ చేసినట్టు ఉన్నారు?
చాలా హడావిడిగా చేశాం. నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా ఐడియా అనుకున్నారు. అప్పుడు నేను, నాన్న వేరే వేరే సినిమాలతో బిజీగా ఉన్నాం. మా ఇద్దరి డేట్స్ కుదిరే సరికి కొవిడ్ వచ్చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఒకే షెడ్యూల్‌లో చేసుకుంటూ వచ్చాం.
మీరు వేరే సినిమాలు కూడా చేస్తున్నారు కదా!
'థాంక్యూ' 85 శాతం అయ్యింది. ఒక్క ఫారిన్ షెడ్యూల్ ఉంది. ఈ నెలాఖరున , జనవరి 25 తర్వాత వెళుతున్నాను. అందులోని నా పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయి.
కరోనా కారణంగా ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడింది. దీనికి తోడు ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ ఒకటి. దానిపై మీ స్పందన?
టికెట్ రేట్స్ గురించి నాన్నతో చాలా డిస్కషన్ జరిగింది. ఏప్రిల్‌లో టికెట్ రేట్స్ జీవో విడుదల చేశారు. మేం ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేశాం. ఏపీలో ఉన్న టికెట్ రేట్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా బడ్జెట్ వేసుకుని ముందుకు వెళ్లాం. రేపు టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్.
దీనికి ముందు చేసిన సినిమాలకు ప్రాబ్లమ్ అవుతుందా?
'దిల్' రాజుగారు (థాంక్యూ సినిమా నిర్మాత) ఉన్నారు. డిస్కస్ చేశాం. ఆయన నిర్ణయం తీసుకుంటారు.
టికెట్ రేట్స్ విషయంలో మీకు ప్రాబ్లమ్ ఏమీ లేదా?
నేను యాక్టర్ అండి. స్టార్టింగ్ నుంచి నటించి రావడం నాకు అలవాటు. సినిమా స్టార్ట్ చేసే ముందు నిర్మాతతో మాట్లాడతాను. 'మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? నా వైపు నుంచి నేను ఏమైనా చేయనా?' అని అడుగుతా. నిర్మాతకు కంఫర్ట్ అయితే... నాకు కంఫర్ట్. నిజంగా ఏదో ఒక కారణంగా డిసైడ్ చేస్తారు. అన్నీ టైమ్‌కు జరుగుతాయి. పరిస్థితులకు తగ్గట్టు ముందుకు వెళ్లాలి.
కథల ఎంపిక గానీ... మంచి చెడు గానీ... షేర్ చేసుకోవడానికి ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
రానా అండ్ అఖిల్... వాళ్లిద్దరూ నా కజిన్స్ అండ్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్‌కు ఇండస్ట్రీతో సంబంధం లేదు.
మీ నాన్నగారు సలహాలు ఇస్తారా?
ఇస్తారు. నాన్నతో ఎప్పుడూ మాట్లాడతా. ఆయన ప్రొడ్యూసర్. నాన్నతో సినిమా చేసేటప్పుడు తుది నిర్ణయం ఆయనకు వదిలేస్తా.
మీ జీవితంలో మార్పు (విడాకులు) వచ్చింది. దాని గురించి...
ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం అది. తను (సమంత) హ్యాపీ. నేను హ్యాపీ. ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ అదే అనుకున్నాం.
'థాంక్యూ' తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
అమెజాన్ కోసం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో హారర్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అది ఒక్కటే కమిట్ అయ్యాను. హారర్ నాకు భయం అయినా... కొత్తగా ట్రై చేస్తున్నాను. హిందీలో చేసిన 'లాల్ సింగ్ చద్దా' ఏప్రిల్ 14న విడుదల అవుతుంది. ఆ సినిమా చేసేటప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. నా కెరీర్ కు సరిపడా తెలుసుకున్నాను. అవకాశం వస్తే ప్రతి యాక్టర్ ఆయనతో ఒక్క సినిమా చేయాలి. ఆయనతో చేయడం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతాం.
దర్శకుడు పరశురామ్‌తో సినిమా?
'సర్కారు వారి పాట' అయిపోయిన తర్వాత ఉంటుంది.
Also Read: పవన్ కల్యాణ్‌తో వన్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి