బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన తాజా సినిమా లాల్ సింగ్ చడ్డా. ఈ చిత్రం ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. వసూళ్లు లేక బాక్సాఫీస్ దగ్గర వెలవెలబోయింది. ఈ సినిమాను నమ్ముకున్న వాళ్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సినిమా నష్టాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రెమ్యునరేషన్ వదులుకునేందుకు రెడీ అయ్యారు.    


లాల్ సింగ్ చడ్డా సినిమా బడ్జెట్ రూ. 180 కోట్లు. అమీర్ ఖాన్, అతడి మాజీ భార్య కిరణ్ రావు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం అమీర్ చాలా కష్టపడ్డారు. ఇతర అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. విక్రమ్ వేద లాంటి క్రేజీ సినిమాలకు సైతం నో చెప్పారు. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. కానీ, ప్రేక్షకుల ఆదరణ లేక బాక్సాఫీస్‌ దగ్గర దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమా మిగిల్చిన నష్టాలను కొంత మేర తగ్గిచేందుకు అమీర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రానికి నాలుగేళ్లు కష్టపడినా..  ఒక్క పైసా కూడా తీసుకోనని ప్రకటించినట్లు తెలుస్తున్నది.


లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం అమీర్ ఖాన్ రూ. 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సినిమా ఏమాత్రం వసూళ్లను రాబట్టలేకపోవడంతో పూర్తి రెమ్యునరేషన్ ను వదులుకుంటున్నారు.  ఈ డబ్బుతో  నిర్మాతల నష్టాలను కొంత మేర తగ్గించాలని భావిస్తున్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమా సుమారు రూ.100 కోట్ల మేర నష్టపోయింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఆయన నటించిన ఏ సినిమా కూడా రూ. 100 కోట్లకు తక్కువ వసూళ్లు సాధించలేదు. తొలిసారి లాల్ సింగ్ చడ్డా ఆ మార్క్ ను దాటలేకపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది.


హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్‌ గా లాల్ సింగ్ చడ్డా సినిమా రూపొందింది. అద్వైత్ చందన్  ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  క‌రీనా క‌పూర్ హీరోయిన్‌ గా నటించింది. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైత‌న్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను సమర్పించారు. నాగార్జున సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొన్నారు. అయినా ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు.. బాలీవుడ్ లో కొనసాగుతున్న బాయ్ కాట్ వ్యవహారం ఈ సినిమా మీద భారీగా పడింది. గత కొంత కాలంగా బలంగా కొనసాగుతున్న ఈ ఉద్యమం లాల్ సింగ్ చడ్డాను చావు దెబ్బకొట్టింది. సినిమా విడుదల నేపథ్యంలో హీరోయిన్ కరీనా కపూర్ బాయ్ కాట్ మీద చేసిన కామెంట్స్ సైతం ఈ సినిమా మీద బాగా ప్రభావాన్ని చూపించాయి. ఆ తర్వాత తను క్షమాపణలు చెప్పినా.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. 


Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు