సీనియర్ హీరో సుమన్ (Actor Suman) క్షేమంగా ఉన్నారు. ఆయనకు ఏమీ కాలేదు. ఆ మాటకు వస్తే... చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. చక్కగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే... సుమన్ మరణించారని యూట్యూబ్‌లో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో కొంత మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రజల ముందుకు తప్పుడు సమాచారాన్ని తీసుకు వెళుతున్నారు. దాంతో ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఆ నోటా, ఈ నోటా సుమన్ వరకు మరణ వార్త ప్రయాణం చేసింది. దాంతో ఆయన ఇదేమి విచిత్రం అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


యూట్యూబ్ మీడియాలో సుమన్ మరణించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. సుమన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఈ ప్రచారాన్ని ఆయన కూడా ఖండించారు. ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని, ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాని సుమన్ తెలిపారు.


నటీనటులకు ఇటువంటి తల నొప్పులు తప్పడం లేదు
కొంత మంది పాపులారిటీ కోసమో, సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమో, వ్యూస్ పెరిగితే వచ్చే డబ్బు కోసమో... యాక్టర్లు బతికుండగా చంపేస్తున్నారు. సీనియర్ నటీనటులకు ఈ విధమైన తల నొప్పులు తప్పడం లేదు. గతంలో కొంత మంది తారలు ఈ విధమైన ఫేక్ డెత్ న్యూస్, యూట్యూబ్ థంబ్‌నైల్స్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ సైతం ఈ విధమైన న్యూస్ ఎలా స్ప్రెడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటువంటి ఫేక్ న్యూస్‌కు ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది.


నాలుగు రోజుల క్రితం బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న సుమన్
సుమన్ పుట్టినరోజు ఆగస్టు 28న. నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులు, తన సన్నిహిత మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆయన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


భారీ నుంచి లో బడ్జెట్ సినిమాల వరకూ... 
నటుడిగా సుమన్ శైలి మిగతా నటీనటులకు చాలా భిన్నమైనది. ఆయన ఒక తరహా సినిమాలకు పరిమితం కావాలని అనుకోవడం లేదు. 'శివాజీ' సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు విలన్‌గా నటిస్తారు. ఆ వెంటనే మరో చిన్న సినిమాలో వేషం వేస్తారు. ఆ మధ్య బంజారా భాషలో తెరకెక్కిన సినిమా కూడా చేశారు. ఇలా చిన్నా పెద్ద సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు.


Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ
 
తమిళనాడులో ప్రముఖ పారిశ్రామికవేత్త అరుల్ శరవణన్ హీరోగా నటించిన 'ది లెజెండ్' సినిమాలో కూడా సుమన్ నటించారు. ఈ ఏడాది కన్నడ సినిమా 'హోమ్ మినిష్టర్'తో శాండిల్‌వుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమన్ నటిస్తున్నారు.  



Also Read : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు