తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్ష సూచనలు ఏమీ లేవు. చాలా వాతావరణం పొడిగానే ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం తమిళనాడు దాని పరసర ప్రాంతాలు, పశ్చిమ విదర్బ, తెలంగాణ, రాయలసీమలపై కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలు, తమిళనాడు అంతర్భాగంలో సుముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, దక్షిణ వైపు వంగి ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి పైకి వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కొమురం భీం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికార వెబ్ సైట్ లో వెల్లడించారు. 


హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మార్పుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో అంతంతమాత్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు.






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అయితే భారీ వర్ష సూచన లేదు. తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.